9, జులై 2013, మంగళవారం

స్వాతి సోమనాథ్‌

సుమధుర స్వాతి నృత్యం
స్వాతి సోమనాథ్‌ ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి. ఎంత సంప్రదాయబద్ధంగా నర్తిస్తుందో అంతకన్నా ఆధునిక భావాలు కలిగిన మహిళ ఆమె. తాను రూపొందించే నృత్యరీతుల్లోనే కాదు, భావాలలోనూ ఆదర్శనీయంగా ఉంటారామె. వ్యక్తిగతంగా ఆమెకు ఎంతగా పేరుప్రఖ్యాతులు వచ్చాయో అంతకన్నా వివాదాలు మరింతగా ఆమెను చుట్టుకున్నారుు. ఆమె చేసే ప్రతి పని లోనూ ఒక సత్సంకల్పం ఉంటుంది. అందులో భగవత్కటాక్షం ఉంటుందని ఆమె నమ్ముతారు.

ప్రొఫైల్‌...
Untia
పూర్తిపేరు : స్వాతి సోమనాథ్‌
జన్మస్థలం : జార్ఖండ్‌
భర్త : సి.హెచ్‌.రవి కుమార్‌  
      (దర్శకుడు)
వృత్తి  : కూచిపూడి 
        నృత్యకళాకారిణి
ప్రఖ్యాతి  : కామసూత్ర నృత్య 
        ప్రదర్శన
బిరుదు  : కళా రత్న

Un2స్వాతి సోమనాథ్‌ అంటే ఆమె నాన్నగారి పేరు కూడా ఆమెతో ఇమిడివుంటుంది. పుట్టింది బీహార్‌...పెరిగింది పశ్చిమబెంగాల్‌లో...స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌ మహానగరంలో. స్వాతి పూర్వికుల స్వస్థలం శ్రీకాకుళం దూసి అగ్రహారం. వారిది సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. స్వాతి తండ్రి సోమనాథ్‌కి సంగీత సాహిత్యాలంటే ఎనలేని అభిమానం. అంతేస్థాయిలో జర్నలిజాన్ని కూడా ప్రోత్సహించేవారు. వృత్తిరీత్యా రైల్వే శాఖలో చేసేవారు. నృత్యప్రదర్శనలు ఏవీ వదిలేవారు కారు. కొన్నిసార్లు ప్రత్యేకంగా స్వాతిని కూడా నృత్యప్రదర్శనలకు తీసుకెళ్లేవారు. చిన్నవయసులో ఊహతెలిసి స్వాతి చూసిన ప్రదర్శన యామినీ కృష్ణమూర్తి ప్రదర్శన. ఆ తర్వాత ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నృత్యభంగిమలు ప్రాక్టీసు చేసేవారు స్వాతి.

ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రముఖ నృత్యకారిణి సుమతీ కౌశల్‌ వద్ద చేర్చారు.వ్యక్తిగతంగా స్వాతి సోమనాథ్‌ ఇచ్చిన కామసూత్ర నృత్యప్రదర్శనకు దేశవిదేశాలనుంచి ఎంతగానో ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో కొంత చెడు ప్రచారం కూడా జరిగింది. అది కేవలం కామసూత్ర అన్న పేరుతో ఆ నృత్యాన్ని ముడిపెట్టడమే అందుకు కారణం.
పేరుతెచ్చిన కామసూత్ర ప్రదర్శన..

Unawకామసూత్ర నృత్యానికి ఆమెకు మంచిపేరే వచ్చినా... సంప్రదాయనృత్యంగానే ఆమె భావించారు. ఆ నృత్యం చేసినందుకు స్వాతి తనని తాను ఏనాడూ విమర్శించుకోలేదు. అది కేవలం కొందరు పనిగట్టుకుని విషం చిమ్మారే తప్ప తన నృత్య భంగిమ లలో ఎటువంటి అసభ్యత కానరాదంటారు స్వాతి. శృంగారరసం లేని సాహిత్యమే లేదు. దాన్ని పక్కన పెట్టి మనమేమీ చేయలేం. సర్వజ్ఞశంకరలో సరస్వతీదేవి వచ్చి ఆది శంకరాచార్యు లను కామశాస్త్రం గురించి అడిగితే ఆయన ఆగిపోతారు. బదులేమీ చెప్పలేక పరకాయ ప్రవేశం చేసి, ఎంజాయ్‌ చేసి మళ్లీ వచ్చి సమాధానం చెబుతారు. కాబట్టి కామం, శృంగారం లేని కళ లేదు అంటారామె. భారతదేశం కళలకు పుట్టినిల్లు.యావత్‌ ప్రపంచానికి ఈ విషయాన్ని కొన్ని తరాలుగా మన కళాకారులు చాటుతున్నారు.

మన దేశంలో ప్రాంతాల వారిగా అనేక నృత్య కళలు ఉన్నాయి. వాటిని భావితరాలకు అందించే బాధ్యతను మనందరం గుర్తించాలి. నేటి తరం పిల్లలకు శాస్ర్తీయ నృత్యంలో ప్రావీణ్యం పొందేలా తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహించాలని కోరారు.నృత్యకళను అభ్యసించిన విద్యార్థులు చదువుల్లోనూ రాణించగలరని పరిశోధనల్లో నిరూపితం అయ్యిందని తెలిపారు.పాశ్చాత్య నృత్యాలు కేవలం శారీరక భంగిమలపై కేంద్రీకృతమై ఉంటాయని.. భారతీయయ శాస్ర్తీయ నృత్యాలు శారీరక భంగిమలతో పాటు, ప్రేక్షకులతో మానసికంగా బంధాన్ని పెనవేసుకుంటా యని తెలిపారు.

వ్యక్తి గత జీవితం..
చిన్నప్పటినుంచే కళా ప్రదర్శనలు ఇచ్చేవారు ఆమె. ఆమె అందం చూసిన కొందరు నిర్మాతలు సినిమాలలోకి రావలసిందిగా ఆఫర్‌ ఇచ్చారు. కానీ సినిమాలపై ఆసక్తి లేక వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. స్వాతి భర్త ప్రముఖ సినిమా దర్శకుడు. సిహెచ్‌.రవికుమార్‌. సామాన్యుడు, విక్టరీ చిత్రాలు తీశారాయన. దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా భార్య కోరికమేరకు ఆమెను పెళ్లి తరువాత స్వాతీ రవికుమార్‌గా పేరు మార్చుకుంటానంటే.. అందరికీ తెలిసిన స్వాతీ సోమనాథ్‌గానే కంటిన్యూ చేయమన్నారు.

కేవలం శాస్త్ర సంగీత అంశాలేకాకుండా ఒక గృహిణిగానూ ఆమె సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆడవారు అన్ని రంగాలలో సమానంగా ఉండాలంటారు. నేటి మహిళలు రాజకీయాలలో కూడా రాణించాలని అవకాశం దొరికితే ఎటువంటి పదవిని అలంకరించడానికైనా వెనకడుగు వేయకూడదంటారు ఆమె. ఆమె చిన్నప్పటినుంచి కూడా చాలా కష్టపడి పైకొచ్చారు. తన పూర్వికుల స్వస్థలమైన శ్రీకాకుళంలో సంగీత,నృత్య కళాశాలను ప్రారంభించాలనేది ఆమె జీవిత సంకల్పం.

పౌరాణికాలంటే స్వాతికి చిన్నతనంనుంచి ఓ ప్రత్యేక అభిమానం. దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన స్వాతిసోమనాధ్‌ విద్యార్థులకు తన ఆశయాలతో స్థాపించిన ఓ స్కూల్లో శిక్షణనిస్తున్నారు. తాను క్లాసికల్‌ డాన్సర్‌గా ఈ రంగంలోకి కేవలం డబ్బు, కీర్తిప్రతిష్టలు సంపాదించడానికి మాత్రం రాలేదంటారు. అలా సంపాదించాలనుకుంటే ఈ పాటికి కోట్లే సంపాదించేదానిని కానీ ఫీజులే లేకుండా అత్యుత్సాహం ఉన్నవారికి తనవంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందంటారామె.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి