9, జులై 2013, మంగళవారం

జగన్నాథ ఆలయం

జగన్నాథ రథయాత్ర
ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో తీర పట్టణమైన పూరిలో ఉంది. జగన్నాథ్‌ అంటే విశ్వానికి దేవుడు అని అర్థం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వారికి ఇది అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందూ తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ఛార్‌ థాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర జనం లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. వైష్ణవులకు, రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు.

శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. స్నాన యాత్రా సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు. రోజూవారి ఆరాధన సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమయినది జూన్‌లో జరిగే రథయాత్ర ఉత్సవం. పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది.

ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు పత్రిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. విచిత్రం ఏమిటంటే రథయాత్ర ప్రారంభం అయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైన స్వామి వారికి సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఇది ఆచరిస్తున్నారు.

ఆకట్టుకునే రథాలు
రథయాతల్రో జగన్నాధుని రథాన్ని ‘నందిఘోష్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి అతి పెద్దవైన పదహారు చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథాన్ని ‘తాళ్‌ధ్వజ్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని ‘దర్ప దళన’ అనే పేరుతో వ్యవహరిస్తారు.గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉన్న జగన్నాథుడు, ఆయన పెద్దసోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వంతో దేవేరుల విగ్రహాలను దర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన శైలిలో మూడు రథాలు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటాయి. రథం కదిలే సమయంలో శంఖాలను, గంటను మోగిస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడడమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలుగా చెబుతారు.

ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు.

మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొం తమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధు ని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావ తారల్లోని కృష్ణుని ఆవతారానికి మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాల న్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయాన్ని చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్‌ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.

వెళ్లడం ఇలా
మన రాష్ట్రం నుండి బయలుదేరి వెళ్లే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సె ప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్లు కలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్‌ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా ఉన్నాయి.

ఆలయ నిర్మాణ విశేషాలు
ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ల దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.

ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్‌గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు. బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరులో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్‌ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి