20, డిసెంబర్ 2016, మంగళవారం

గుప్పెడంత‌...అమృత క‌ల‌శం


ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్క అడుగు.. ముందుకు కదిలితే.. ఎవరెస్ట్‌ శిఖరమైనా తలవంచాల్సిందే. గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి. చలిచీమలు కూడా.. కలిసికట్టుగా సమూహమైతే.. కొండచిలువ కంటే బలంగా మారతాయి. సరిగ్గా ఈ విద్యార్థుల సంకల్పం కూడా అలాంటిదే. పుస్తకాలను తడిమే చేతులతోనే 'గుప్పెడు బియ్యం' చేతపట్టి సమాజసేవకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. సాటివారికి ఏదో ఒక మంచి చేయాలనే గుప్పెడంత సంకల్పమే.. అక్కడ 'అమృత కలశం'గా మారింది. ఇప్పుడు ఆ అమృత కలశమే.. అనేకమంది పేదల కడుపుల ఆకలి తీరుస్తోంది. అందుకే.. ఆ బడిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే గుప్పెడు బియ్యంతో.. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాల్సిందే!!
చదువుతోపాటు.. సమాజానికీ ఏదో ఒకటి చేయాలి. ఎలా చేస్తే బావుంటుంది..? ఏంచేస్తే బావుంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టిందే 'అమృత కలశం'. తమకు తామే.. తాము చదివే కళాశాలలోనే 'ఆమృత కలశం' అనే కార్యక్రమాన్ని నిర్దేశించుకుని గత కొన్నేళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్నారు. వారే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు.

కళాశాలలో
విద్యార్థులకు విద్య నేర్పడమేకాదు విద్యతోబాటు సమాజం పట్ల బాధ్యత, సేవాతత్పరత, ఔదార్యం వంటి విలువలను నేర్పించాలనే గురువుల ఒక గొప్ప ఆలోచనే అక్కడ ''అమృత కలశం''గా రూపుదిద్దుకుంది. దీనిద్వారా విద్యార్థులు సమాజంపై సేవాభావాన్ని మరింత పెంపొందించుకుంటూ కొండంత ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఎవరైనా ఈ కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే అక్కడ బియ్యం నిల్వచేసే ఓ పెద్ద డబ్బా కన్పిస్తుంది. దానిపేరే 'అమృత కలశం'. గుప్పెడు బియ్యం
వారంలో రెండు రోజులు ఆ కళాశాల విద్యార్థులంతా ఈ పనిలో నిమగమౌతారు. ప్రతి బుధవారం, శనివారం రోజుల్లో విద్యార్థులు, అధ్యాపకులు తమ ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్టుకొచ్చి అమృత కలశం డబ్బాల్లో వేెస్తారు. ఈ రెండు రోజుల్లో ఏ విద్యార్థి సంచి తెరిచినా అందులో గుప్పెడు బియ్యం కనిపిస్తాయి.
రెండేళ్ల కిందట
ప్రతి వ్యక్తీ వారంలో ఒకపూట తినే ఆహరంలో పావు భాగాన్ని ఇతరులకు ఇస్తే వారి ఆకలి తీరుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ భావిస్తే అకలి కేకలు లేని సమాజం సాధ్యమౌతుందనేది విద్యార్థుల భావన. ఈ కళాశాల డైరక్టర్‌ దుర్గా ప్రసాద్‌తో అదే విషయాన్ని విద్యార్థులు పంచుకున్నారు. ఆ ఆలోచనకు మేము సైతం అంటూ అధ్యాపకులు కూడా విద్యార్థులకు చేయూతను ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంతా కలసి రెండేళ్ళ కిందట ఈ 'అమృత కలశం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచీ ఎలాంటి అవాంతరమూ లేకుండా విద్యార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇందులో పాల్గొంటున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అండగా నిలవడం విశేషం.


విద్యార్థులదే నిర్ణయం
అమృత కలశం ద్వారా సేకరించిన బియ్యం సుమారు రెండు మూడు క్వింటాలు వరకూ సమకూరగానే వృద్ధాశ్రమాలకు, అనాధశ్రమాలకు, అర్హులైన పేదలకు ఆదివారం రోజున అందజేస్తారు. ఈ బియ్యం ఎవరికి ఇవ్వాలి? అని నిర్ణయించేది కూడా విద్యార్థులే. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ప్రేమతో పెట్టుకున్న పేరు 'హ్యాండ్‌ పుల్‌అఫ్‌్‌ రైస్‌'. ఈ కళాశాలలో చదువుతున్న వారిలో అధిక శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన వారే. ఇలా గుప్పెటతో తమ ఇళ్ళ నుంచి విద్యార్థులు తీసుకొచ్చే బియ్యం నెలకు సుమారు ఐదు వందల కేజీల బియ్యం (సుమారు 5 క్వింటాళ్లు) దాకా అవుతుంది. అలా పోగైన బియ్యాన్ని అనాధాశ్రమాలకు, పేదలకు అందజేస్తారు.


ఎందరికో ప్రేరణ
అమృత కలశం కార్యక్రమాన్ని విద్యార్థులే తమకు తాముగా నిర్వహించుకుంటున్నాగానీ.. దీనిని ఈ కళాశాల జాతీయ సేవాపథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) కమిటీ పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలను అందిస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొంటూ ఉండడంతో ఈ కార్యక్రమం మరింత ఎక్కువ మందికి చేరువవుతోంది. ఈ 'అమృత కలశం' ద్వారా సమకూరిన బియ్యాన్ని ఇచ్చిన వారికే ఇవ్వకుండా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కొత్త లబ్ధిదారుల్ని గుర్తిస్త్తూ, వారికి అందిస్తుంటారు. ఈ విషయంలో కచ్ఛితమైన నిబంధనలు పాటిస్తారు. విద్యార్థులు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమం అందరి మన్ననలనూ పొందుతూ ఎంతో మందికి ప్రేరణనిస్తోంది.సొంతపిల్లలకన్నా ఎక్కువే
నా కొడుకులు వలసపోయారు. ఒక్కదాన్నే ఇక్కడ మిగిలాను. పని చేసుకునే శక్తి లేదు. పిల్లలు అందిస్తున్న బియ్యంతోనే కడుపు నింపుకుంటున్నాను. వారికి నేను ఏమీ కాకపోయినా సొంత పిల్లల కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలైనా ఎంతో రుణపడి ఉన్నాను.
- భైరి నాగరత్నం, సింగుపురం
 

మా ఆకలిని తీరుస్తున్నారు
ఈ పిల్లలది ఎంతో పెద్ద మనసు. కూలి పనిచేయడానికి కూడా అవకాశంలేక, శరీరం సహకరించక ఆకలితో బాధపడే మాలాంటి వారికి ఆత్మబంధువులు ఈ పిల్లలు. వీళ్లు అందించే ఈ బియ్యం పది రోజుల పాటు మా ఆకలిని తీరుస్తున్నాయి.
- గరికవాడు, నరసన్నపేట
 

విద్యార్థుల సంకల్పం గొప్పది
కేవలం తరగతి గదుల్లో చదువు మాత్రమే విద్యార్థులకు సరిపోదు. చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల జీవితాలను కూడా చదవాలి. అప్పుడే వారి చదువుకు తగిన లక్ష్యం ఉంటుంది. సామాజిక బాధ్యతకు దూరంగా ఉండే చదువుల వల్ల సమాజానికి ఉపయోగం లేదు. ఈ కార్యక్రమం చూడడానికి చిన్నపనిలా ఉన్నా గానీ, పెద్ద సంకల్పంతో చేస్తున్నారు. అందుకే, పిల్లలకు అండగా నిలబడుతున్నాం.
- సిహెచ్‌. దుర్గాప్రసాద్‌,
కళాశాల డైరెక్టర్‌ 
 

విలువలు నేర్పే బడి
విద్యతో పాటు జీవిత విలువల్నీ తెలుసుకోవలసిన బాధ్యత మా అందరిపై ఉంది. దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని పాలకులు చెబుతున్నా ఇప్పటికీ పేదలు ఆకలిమంటలతో అల్లాడుతున్నారు. విద్యార్థులుగా మా చేతనైన సాయం చేయాలన్నదే మా సంకల్పం.
- బోర ఈశ్వరరావు, విద్యార్థి

 

సేవలోనే నిజమైన ఆనందం
ఈ కళాశాలలో చేరిన తరువాత నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాను. అందుకే కళాశాలలో మా స్నేహితులు నిర్వహిస్తున్న 'అమృత కలశం' కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాను.
- కళావతి, విద్యార్థిని 
                                                                                 ---బెందాళం క్రిష్ణారావు
                                                                                      

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి