9, జులై 2013, మంగళవారం

స్వాతి సోమనాథ్‌

సుమధుర స్వాతి నృత్యం
స్వాతి సోమనాథ్‌ ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి. ఎంత సంప్రదాయబద్ధంగా నర్తిస్తుందో అంతకన్నా ఆధునిక భావాలు కలిగిన మహిళ ఆమె. తాను రూపొందించే నృత్యరీతుల్లోనే కాదు, భావాలలోనూ ఆదర్శనీయంగా ఉంటారామె. వ్యక్తిగతంగా ఆమెకు ఎంతగా పేరుప్రఖ్యాతులు వచ్చాయో అంతకన్నా వివాదాలు మరింతగా ఆమెను చుట్టుకున్నారుు. ఆమె చేసే ప్రతి పని లోనూ ఒక సత్సంకల్పం ఉంటుంది. అందులో భగవత్కటాక్షం ఉంటుందని ఆమె నమ్ముతారు.

ప్రొఫైల్‌...
Untia
పూర్తిపేరు  : స్వాతి సోమనాథ్‌
జన్మస్థలం  : జార్ఖండ్‌
భర్త  : సి.హెచ్‌.రవి కుమార్‌   
           (దర్శకుడు)
వృత్తి    : కూచిపూడి  
                నృత్యకళాకారిణి
ప్రఖ్యాతి   : కామసూత్ర నృత్య 
                ప్రదర్శన
బిరుదు   : కళా రత్న

Un2స్వాతి సోమనాథ్‌ అంటే ఆమె నాన్నగారి పేరు కూడా ఆమెతో ఇమిడివుంటుంది. పుట్టింది బీహార్‌...పెరిగింది పశ్చిమబెంగాల్‌లో...స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌ మహానగరంలో. స్వాతి పూర్వికుల స్వస్థలం శ్రీకాకుళం దూసి అగ్రహారం. వారిది సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. స్వాతి తండ్రి సోమనాథ్‌కి సంగీత సాహిత్యాలంటే ఎనలేని అభిమానం. అంతేస్థాయిలో జర్నలిజాన్ని కూడా ప్రోత్సహించేవారు. వృత్తిరీత్యా రైల్వే శాఖలో చేసేవారు. నృత్యప్రదర్శనలు ఏవీ వదిలేవారు కారు. కొన్నిసార్లు ప్రత్యేకంగా స్వాతిని కూడా నృత్యప్రదర్శనలకు తీసుకెళ్లేవారు. చిన్నవయసులో ఊహతెలిసి స్వాతి చూసిన ప్రదర్శన యామినీ కృష్ణమూర్తి ప్రదర్శన. ఆ తర్వాత ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నృత్యభంగిమలు ప్రాక్టీసు చేసేవారు స్వాతి.

ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రముఖ నృత్యకారిణి సుమతీ కౌశల్‌ వద్ద చేర్చారు.వ్యక్తిగతంగా స్వాతి సోమనాథ్‌ ఇచ్చిన కామసూత్ర నృత్యప్రదర్శనకు దేశవిదేశాలనుంచి ఎంతగానో ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో కొంత చెడు ప్రచారం కూడా జరిగింది. అది కేవలం కామసూత్ర అన్న పేరుతో ఆ నృత్యాన్ని ముడిపెట్టడమే అందుకు కారణం.
పేరుతెచ్చిన కామసూత్ర ప్రదర్శన..

Unawకామసూత్ర నృత్యానికి ఆమెకు మంచిపేరే వచ్చినా... సంప్రదాయనృత్యంగానే ఆమె భావించారు. ఆ నృత్యం చేసినందుకు స్వాతి తనని తాను ఏనాడూ విమర్శించుకోలేదు. అది కేవలం కొందరు పనిగట్టుకుని విషం చిమ్మారే తప్ప తన నృత్య భంగిమ లలో ఎటువంటి అసభ్యత కానరాదంటారు స్వాతి. శృంగారరసం లేని సాహిత్యమే లేదు. దాన్ని పక్కన పెట్టి మనమేమీ చేయలేం. సర్వజ్ఞశంకరలో సరస్వతీదేవి వచ్చి ఆది శంకరాచార్యు లను కామశాస్త్రం గురించి అడిగితే ఆయన ఆగిపోతారు. బదులేమీ చెప్పలేక పరకాయ ప్రవేశం చేసి, ఎంజాయ్‌ చేసి మళ్లీ వచ్చి సమాధానం చెబుతారు. కాబట్టి కామం, శృంగారం లేని కళ లేదు అంటారామె. భారతదేశం కళలకు పుట్టినిల్లు.యావత్‌ ప్రపంచానికి ఈ విషయాన్ని కొన్ని తరాలుగా మన కళాకారులు చాటుతున్నారు.

మన దేశంలో ప్రాంతాల వారిగా అనేక నృత్య కళలు ఉన్నాయి. వాటిని భావితరాలకు అందించే బాధ్యతను మనందరం గుర్తించాలి. నేటి తరం పిల్లలకు శాస్ర్తీయ నృత్యంలో ప్రావీణ్యం పొందేలా తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహించాలని కోరారు.నృత్యకళను అభ్యసించిన విద్యార్థులు చదువుల్లోనూ రాణించగలరని పరిశోధనల్లో నిరూపితం అయ్యిందని తెలిపారు.పాశ్చాత్య నృత్యాలు కేవలం శారీరక భంగిమలపై కేంద్రీకృతమై ఉంటాయని.. భారతీయయ శాస్ర్తీయ నృత్యాలు శారీరక భంగిమలతో పాటు, ప్రేక్షకులతో మానసికంగా బంధాన్ని పెనవేసుకుంటా యని తెలిపారు.

వ్యక్తి గత జీవితం..
చిన్నప్పటినుంచే కళా ప్రదర్శనలు ఇచ్చేవారు ఆమె. ఆమె అందం చూసిన కొందరు నిర్మాతలు సినిమాలలోకి రావలసిందిగా ఆఫర్‌ ఇచ్చారు. కానీ సినిమాలపై ఆసక్తి లేక వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. స్వాతి భర్త ప్రముఖ సినిమా దర్శకుడు. సిహెచ్‌.రవికుమార్‌. సామాన్యుడు, విక్టరీ చిత్రాలు తీశారాయన. దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా భార్య కోరికమేరకు ఆమెను పెళ్లి తరువాత స్వాతీ రవికుమార్‌గా పేరు మార్చుకుంటానంటే.. అందరికీ తెలిసిన స్వాతీ సోమనాథ్‌గానే కంటిన్యూ చేయమన్నారు.

కేవలం శాస్త్ర సంగీత అంశాలేకాకుండా ఒక గృహిణిగానూ ఆమె సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆడవారు అన్ని రంగాలలో సమానంగా ఉండాలంటారు. నేటి మహిళలు రాజకీయాలలో కూడా రాణించాలని అవకాశం దొరికితే ఎటువంటి పదవిని అలంకరించడానికైనా వెనకడుగు వేయకూడదంటారు ఆమె. ఆమె చిన్నప్పటినుంచి కూడా చాలా కష్టపడి పైకొచ్చారు. తన పూర్వికుల స్వస్థలమైన శ్రీకాకుళంలో సంగీత,నృత్య కళాశాలను ప్రారంభించాలనేది ఆమె జీవిత సంకల్పం.

పౌరాణికాలంటే స్వాతికి చిన్నతనంనుంచి ఓ ప్రత్యేక అభిమానం. దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన స్వాతిసోమనాధ్‌ విద్యార్థులకు తన ఆశయాలతో స్థాపించిన ఓ స్కూల్లో శిక్షణనిస్తున్నారు. తాను క్లాసికల్‌ డాన్సర్‌గా ఈ రంగంలోకి కేవలం డబ్బు, కీర్తిప్రతిష్టలు సంపాదించడానికి మాత్రం రాలేదంటారు. అలా సంపాదించాలనుకుంటే ఈ పాటికి కోట్లే సంపాదించేదానిని కానీ ఫీజులే లేకుండా అత్యుత్సాహం ఉన్నవారికి తనవంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందంటారామె.

బారువా

గ్రామమే ఓ ఆలయం... బారువా
 
 
 
ఆ ఊళ్లో మీరు ఏ వీధికి వెళ్లినా ఓ దేవాలయం దర్శనమిస్తుంది. వీటికి తోడు సముద్ర తీరం, అం దమైన ప్రకృతి శోభలతో ఈ గ్రామం కళకళలాడుతుంటూంది. ఆ గ్రామం పేరే బారువా శ్రీకాకుళంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో ఆలయాలలో ప్రసిద్ది చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధ నస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది.


బారువ సముద్రతీరం... 

ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్ర తీరంలో నిలుచుని చూడటం మరుపురాని మహాద్భుతం. మహాభారతం, స్కంధపురాణం వంటి ధార్మిక గ్రంధాలలో బారువ తీరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరమహోదయానికి ఈ స్థలం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. చివరిసారిగా ఆ శుభదిన 07 ఫిబ్రవరి 2008 నాడు వచ్చింది. ఆ సమయంలో మహోదయ పుష్కర స్నానాలు బారువ తీరం కిటకిటలాడు తుంది. తూర్పుకనుమల నుంచి మొదలై ఒరిస్సా, ఆంధ్రా రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ, బంగాళాఖాతములో కలుస్తున్న పవిత్ర మహేంద్ర తనయ నదీ సంగమ స్థలమే ఈ బారువ గ్రామం. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడకు వస్తారు. మాఘమాసం, శ్రవణ నక్షత్రం గురువారం ఉదయం 6.39 నిముషాలకు పుష్కర శుభఘడియలు ప్రారంభమవుతాయి.


చారిత్రక నేపథ్యం...
స్కంధపురాణం ఆధారంగా పలువురు సిద్ధాంతుల ప్రకారం... సుమారు 16 వేల సంవత్సరాల క్రితం తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని వేటాడే ప్రయత్నములో విడిచిన బాణం సుదూరంలో వున్న ఒక గోవును తాకగా గోవు చనిపోయినది. గొహత్యా మహా పాపమని భావించి పాపవిమోచన కోసం ఆలోచించారు పాండవులు. ఈ నేపథ్యంలో మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవుని సముద్రతీరానికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలని సలహా ఇవ్వడంతో ఆ గోవును సముద్ర తీరానికి తరలించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం అక్కడే వున్న పావన మహేంద్ర తనయ నదీ-సాగర సంగమ స్థలంలో పాండవులు స్నానాలు ఆచరించి, మోక్షం పొందేరని చారిత్రక కథనం.

Baru5పాండవులు సంగమ స్నానం చేసిన అనంతరం సమీపాన వున్న గ్రామానికి వెళ్లి అక్కడ 12 మంది బ్రాహ్మణుల సమక్షంలో యజ్ఞోపవీతం చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాన్ని ‘బారాహరాపురం’ గా పిలిచేవారు, కాలక్రమేణా అది బారువగా మారినది. బారువ గ్రామం పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమ భాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కథనం. అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు.

దీనికి దక్షిణ వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయం, ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపా లస్వామి ఆలయం, మహంకాళీ, కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడం సంప్రదాయంగా వస్తూ ఉంది.

జగన్నాథ ఆలయం

జగన్నాథ రథయాత్ర
ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో తీర పట్టణమైన పూరిలో ఉంది. జగన్నాథ్‌ అంటే విశ్వానికి దేవుడు అని అర్థం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వారికి ఇది అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందూ తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ఛార్‌ థాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర జనం లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. వైష్ణవులకు, రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు.

శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. స్నాన యాత్రా సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు. రోజూవారి ఆరాధన సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమయినది జూన్‌లో జరిగే రథయాత్ర ఉత్సవం. పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది.

ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు పత్రిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. విచిత్రం ఏమిటంటే రథయాత్ర ప్రారంభం అయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైన స్వామి వారికి సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఇది ఆచరిస్తున్నారు.

ఆకట్టుకునే రథాలు
రథయాతల్రో జగన్నాధుని రథాన్ని ‘నందిఘోష్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి అతి పెద్దవైన పదహారు చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథాన్ని ‘తాళ్‌ధ్వజ్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని ‘దర్ప దళన’ అనే పేరుతో వ్యవహరిస్తారు.గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉన్న జగన్నాథుడు, ఆయన పెద్దసోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వంతో దేవేరుల విగ్రహాలను దర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన శైలిలో మూడు రథాలు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటాయి. రథం కదిలే సమయంలో శంఖాలను, గంటను మోగిస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడడమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలుగా చెబుతారు.

ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు.

మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొం తమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధు ని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావ తారల్లోని కృష్ణుని ఆవతారానికి మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాల న్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయాన్ని చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్‌ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.

వెళ్లడం ఇలా
మన రాష్ట్రం నుండి బయలుదేరి వెళ్లే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సె ప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్లు కలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్‌ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా ఉన్నాయి.

ఆలయ నిర్మాణ విశేషాలు
ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ల దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.

ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్‌గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు. బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరులో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్‌ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు.

శాలిహుండం

శాలిహుండం
ఆంధ్రదేశంలో ఉన్న సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి శాలి హుండం. శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో... వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేస్తూ ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టే పర్యాటక స్థలం, అందమైన క్షేత్రం శాలిహుండం. పూర్వం శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారం) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు.
శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగ పట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.
శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఎ.హెచ్‌.లాంగ్‌హర్ట్‌‌స, టి.ఎన్‌.రామచంద్రన్‌, ఆర్‌.సుబ్రహ్మణ్యన్‌ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహం, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీపూ 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.

11, మే 2013, శనివారం

తాపీ ధర్మారావు

తాతాజీ ఒరవడి
తాపీ ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందిరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు.

tapi-dharmaraoతాపీ ధర్మారావు ఆంధ్ర సాహితీ రంగంలో అద్వితీయమైన కృషి చేసిన మహనీయుడు. ఆయన గ్రాంథిక భాషావాదిగా కావ్య రచన చేశాడు. తరువాత వ్యావహారిక భాషావాదిగా మారి పత్రికా రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆయన మొట్టమొదట పత్రికారంగంలో ప్రవేశించింది ‘సమ దర్శిని’ సంపాదకుడుగా. అది జస్టిస్‌ పార్టీ పత్రిక. ‘సమ దర్శిని’ ప్రచురణ కర్త పింజల సుబ్రహ్మణ్య శెట్టి. ఆయన తెలుగు ప్రాంతంనుంచి తమిళప్రాంతానికి వెళ్ళి స్థిరపడిన తెలుగు ప్రముఖులు. ‘సమ దర్శిని’ జస్టిస్‌ పార్టీ భావజాలంతో ఆనాటి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రోత్సహించేది. ధర్మారావుకి ఆ పత్రికతో సంబంధం ఏర్పడేనాటికే ఆయన రచయితగా ప్రసిద్ధి పొందాడు. పత్రిక వల్ల గూడవల్లి రామబ్రహ్మం, మరుజీవి కోదండ రామిరెడ్డి వంటివారు ధర్మారావు సన్నిహితులయ్యారు. అనేక విషయాలమీద ఆ పత్రికలో రచనలు వస్తూ ఉండేవి. అయితే భాష సరళ గ్రాంథికంలో ఉండేది.

‘సమ దర్శిని’ నుంచి ధర్మారావు ‘ప్రజామిత్ర’కు మారడం జరిగింది. ఆ మార్పు సాదా సీదా మార్పు కాదు. భాషాపరంగా గుణాత్మకమైన మార్పు. గ్రాంథిక భాషావాదిగా ఉన్న ఆయన వ్యావహారిక భాషావాదిగా మారి తెలుగు జర్నలిజానికి నూతన దిశానిర్దేశం చేసిన మార్పు. ప్రజామిత్ర సారథి గూడవల్లి రామబ్రహ్మం. ధర్మారావుకీ ఆయనకీ సమదర్శిని నాటినుంచే ఆత్మీయ బంధం ఏర్పడింది. రామబ్రహ్మం ధర్మారావును గురూజీ అనే పిలిచేవారు. ప్రజామిత్రతో ఎందరో ప్రముఖులకు సంబంధం ఉండేది. సముద్రాల రాఘవాచార్య, నార్ల, శ్రీనివాస్‌ శిరోమణి, ఆండ్ర శేషగిరిరావు, బోయి భీమన్న లాంటి వాళ్ళంతా ఆ కార్యాలయంలో చర్చలు సాగిస్తూ ఉండేవారు. వాటిని వ్యాసాలుగా ప్రజామిత్ర ప్రచురించేది. చలం లాంటి వచన రచయితలు సాహిత్య రంగంలో దుమారం లేపుతూ ఉండేవారు.

వావహారిక భాషా ప్రియత్వం ఎంతటిదో విశదమవుతూ ఉండేది. ఆ ప్రభావంతోనే ధర్మారావు గ్రాంథికం నుంచి వ్యావహారానికి మారి రచనలు చెయ్యడానికి ప్రజామిత్ర మార్గం సుగమం చేసింది. ఈనాటికీ ధర్మారావు పేరుకు పర్యాయంగా నిలిచే ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’ వ్యాసాలు ప్రజామిత్రలో వచ్చినవే. అలాగే ‘కొత్త పాళీ’ వ్యాసాలను ప్రజామిత్ర ధారావాహికంగా ప్రచురించింది. ప్రజామిత్ర తరువాత ధర్మారావు సంపాదకత్వం వహించిన పత్రిక ‘జన వాణి’. రాజకీయ కారణాల వల్ల పిఠాపురం రాజా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో దినపత్రిక స్థాపించారు. తెలుగు పత్రికకు జనవాణి అని పేరు పెట్టారు. ధర్మారావు సంపాదకత్వంలో నడిచిన ఆ పత్రికలో నార్ల, పి. శ్రీరాములు, పండితారాధ్యుల నాగేశ్వరరావు వంటివారు ఉప సంపాదకులుగా పని చేశారు.

ఈ ప్రముఖులందరూ తరువాత కాలంలో ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి లాంటి పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. జనవాణి వెలువడేనాటికి ఆంధ్రపత్రిక ఒక్కటే దిన పత్రిక. ఆ పత్రికలో భాష గ్రాంథికం. ఆ పత్రికలో రెండు కాలమ్‌ల శీర్షికలు గాని, బానర్‌ గాని ఉండేవి కావు. ఒకప్పుడు హిందూ పత్రిక ఆంగ్లంలో ఉన్నట్టుగా మొదటి పేజీ నిండా వ్యాపార ప్రకటనలే ఉండేవి. అలాంటి నేపథ్యంలో ధర్మారావు వ్యావహారిక భాష లోనే పత్రిక నడపాలని సంకల్పించారు. పత్రిక స్వరూపాన్ని ధర్మారావు మార్చారు. రక రకాల టైపుల్ని ఉపయోగించారు. శీర్షికల్ని రెండు కాలమ్‌లలో, మూడు కాలమ్‌లో పెట్టేవారు. బానర్‌లనీ పెట్టేవారు. వార్తలు కూడా ఇంగ్లీషు నుంచి మక్కికి మక్కీ అనువాదం కాకుండా సొంత మాటల్లో, సొంతంగా వ్రాస్తున్నట్టు ఉండాలని సిబ్బందికి శిక్షణ నిచ్చారు. శీర్షికలు పాఠకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని చెప్పేవారు. ఆ రకంగా పత్రిక ఆకర్షణీయం అయ్యేలా చూసేవారు.

ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందిరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు. తన బాణీని ధర్మారావే ఒక సందర్భంలో వివరించారు. ‘తక్కువ పదాలతో వాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారికమనిపిస్తుంది. క్రియా పదాలు వ్యావహారికం చెయ్యడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్‌ కనిపెట్టాను. గ్రాంథిక భాషా వాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది కాదు’. ఈ టెక్నిక్‌ని న్యాపతి నారాయణ రావు కూడా ప్రశంసించారు. ధర్మారావు పస గల భాషావాదవుతున్నా’రని గ్రాంథిక భాషావాది అయిన కట్టమంచి రామలింగారెడ్డి మెచ్చుకున్నారని నార్ల చెప్పారు. ధర్మారావు అలా ఆ తరవాత వచ్చిన తెలుగు పత్రికలన్నింటికీ పథ నిర్దేశకులయారు. ఆంధ్ర పత్రిక కూడా కొత్తమార్గాన్ని అనుసరించక తప్పింది కాదు.

జనవాణి నిర్వహణ భారం కష్టమని తోచి పిఠాపురం రాజా దాన్ని నిలిపివేశారు. ధర్మారావు అప్పటికి జీవితంలో ఒడిదుడుకులు లేకుండానే గడుపుతున్నారు. కాని తన మనసులో వెల్లువెత్తుతున్న భావాల్ని వెల్లడించడానికి పత్రిక లేదు. తను జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కిన మనిషి. దాంతో పత్రిక లేని లోటు స్పష్టంగా కనబడింది. ఎవరి కొలువులోనో నడిచే పత్రిక ఎందుకు అనిపించింది. తనే స్వయంగా ఒక పత్రికను నిర్వహించవచ్చునన్న ఆలోచనా మెదిలింది. అలా ‘కాగడా’ పత్రికకు నాందీ పలకడం జరిగింది. పత్రిక ప్రతి బుధవారం వెలువడేది. ఆయనా, ఆయన పెద్ద కుమారుడు మోహనరావు పత్రికను నిర్వహించేవారు.

devalayalu‘కొత్త జీవకళను ప్రవహింపచేసేందుకు పత్రికా ముఖంగా సాయపడడమూ, సమాజంలోని వివిధ అంశాలనూ, దానిలోని వివిధ పరిణామాలనూ సహేతుకంగా విశదీకరించి ప్రతికా ప్రపంచంలో ఒక కొత్త యుగాన్ని స్థాపించడమూ’ కాగడా ఆశయాలు. ప్రతిక ఆశయాలకు అనుగుణంగానే నడిచింది. ప్రపంచ సంస్కరణలకి ఆసరా అందించేది. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించింది. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని భూతంలా ఆవహించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. కాగడా ప్రపంచ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఉండేది. కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైనా వామపక్ష భావాలవైపు కాగడా మొగ్గు చూపించింది.

సాంఘికంగా, రాజకీయంగా పురోగామి శక్తులకు కాగడా వెన్ను దన్నుగా ఉండేది. అయితే ప్రతికగా అది తన వంతు కృషిని అద్వితీయంగా నిర్వహించింది. ‘కాగడా గాలి విసురు’, ‘పిట్ట చూపు’ లాంటి శీర్షికలతో రాజకీయ ఘటనలపై, నాయకులపై, ప్రభుత్వ అధికారులపై విమర్శనాత్మక వ్యాఖ్యల్ని సంధించేది. ధర్మారావు అంతకు ముందు పాలు పంచుకున్న పత్రికలలోనూ కలం పేరుతో రచనలు చేశారు. కాగడాలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ‘తడాకా’ అనే కలం పేరుతో శీర్షికను నిర్వహించేవారు. సిహత్య కృషీ ఆ కోవలోనే సాగేది. ‘పరాక్‌’ అనే శీర్షికన ప్రాచీన సాహిత్యం గురించి పాఠకుల్లో అభిరుచి కలిగించారు. అలాగే యేదో పేరుతో ఒక చర్చను లేవనెత్తేవారు. ఆ చర్చలు సంచలనం కలిగించేవి. విషయ విశ్లేషణకీ, వాదనకీ అవి ఆధారమయేవి. ‘సత్యవతి’ పేరుతో ప్రేమ వివాహాల మీద ధర్మారావు నిర్వహించిన చర్చ అలంటిదే.

‘పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు’, ‘ఇనుప కచ్చడాలు’ వ్యాసాలు ఆ పత్రికలోనే వచ్చాయి. ‘పద్య భిక్ష’ పేరు మీద ప్రాచీన కవిత్వం మీద ఆసక్తి కలిగించారు. పత్రికారంగంలో కృషి చేసి జర్నలిజానికి ధర్మారావు పెద్ద పీట వేశారు. సినిమా రంగంలో ఎన్నో సినిమాలకి మాటలు, పాటలు రాశారు. సాహిత్య రంగంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు, విమర్శలూ రాశారు. ఇవన్నీ ఆయన పరిశోధనా పాటవాన్నీ, ప్రతిభనీ ప్రతిబింబించాయి. ఆయన అంతటితోనే ఆగక ప్రచురణ సంస్థలు స్థాపించారు. మొదటగా స్థాపించిన ప్రచురణ సంస్థ ‘వేగుచుక్క’ గ్రంథమాల. అప్పటికి ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’ స్థాపన జరిగింది. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి 1906లో ఆవిర్భవించింది. కొమర్రాజు లక్షణరావు సంపాదకులు.

సంవత్సరానికి నాలుగు పుస్తకాలు తీసుకురావాలన్నది లక్ష్యం. ఆ సంస్థను దృష్టిలో ఉంచుకునే ధర్మారావు 1911లో ‘వేగుచుక్క’ గ్రంథమాలకు శ్రీకారం చుట్టారు. విజ్ఞానచంద్రికవారి పరిధిలోకి రాని ప్రక్రియలను ప్రచురించాలని భావించారు. అప్పటికి ధర్మారావు గ్రాంథిక భాషావాది. అంచేత ప్రచురణలు ఆ మూసలోనే ఉండేవి. గ్రాంథిక భాషని సమర్ధిస్తూ ‘ఆంధ్రులకొక విన్నపం’ అని ఒక ప్రకటన దానిద్వారానే ప్రచురితమైంది. ఆయన ‘పాతపాళీ’ రచనలన్నీ ఆ సంస్థ ద్వారానే వెలుగు చూశాయి. ఆ తరువాత పత్రికలలో పని చెయ్యడం, పత్రికలని నిర్వహించడం వల్ల స్వంత ప్రచురణ సంస్థల ఆలోచన వచ్చినట్టు లేదు. ఆయన వచన రచనలన్నీ పత్రికల కోసం రాశారు.

అవి అచ్చులో అలా అందరికీ దర్శనమిచ్చినవే. అయితే చెదురు మదురుగా ఉన్న రచనల్ని ఒక గ్రంథరూపంలో ప్రచురిస్తే నాలుగు కాలాలపాటు నిలబడతాయి. అందరికీ అందుబాటులోకి వస్తాయి. లేనట్లయితే ఎంతటి సంచలనాత్మక రచన అయినా అది ముద్రణకు నోచుకున్న పత్రికతో పాటే తెరమరుగు అయిపోతుంది. వార్తాపత్రికల మనుగడ కొన్ని గంటలు వూత్రమే. పక్ష మాస పత్రికల ఆయుష్షూ అంతే. ‘బుక్స్‌ ఆఫ్‌ది అవర్‌, బుక్స్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ని రస్కిన్‌ అన్న మాటలు మనసులో పెట్టుకోవాలి. వాటి గుణాల్ని బట్టి ఇలాంటి వర్గీకరణ ఉంటుంది.

అందుచేత గ్రంథ ప్రచురణ రచనల జీవిత కాలాన్ని పెంచుతుంది. గ్రంథరూపంలో రాకపోవడం వల్లనే ఆంగ్లంలో గురజాడ కథ హిస్టూల్స్‌ టు కంకర్‌ (తెలుగు అనువాదం ‘సంస్కర్త హృదయం) అలభ్యమైంది. అలాగే ఆయన మద్రాస్‌ కాంగ్రెస్‌ మహాసభ గురించి రాసిన ఆంగ్ల వ్యాస కృతి కూడా. ధర్మారావు రచించిన పెళ్ళి పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు పత్రికలలో ధారావాహికంగా వచ్చి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వాటిని గుదిగుచ్చి పుస్తకాల రూపంలో తేవాలి. నలుగురిలోనూ నిలబెట్టాలి.

అలా ఆవిర్భవించినదే ‘తాతాజీ ప్రచురణలు’ అన్న ప్రచురణ సంస్థ, ‘అన్నపూర్ణ ప్రచురణలు’ అన్న సంస్థ. ఆయన జీవితంలో అడుగడుగునా చేదోడు వాదోడుగా ఉన్న మహనీయురాలు ఆయన సతీమణి అన్నపూర్ణ. పెళ్ళయిన కొత్తలో (బాల్యవివాహమే అయినా) ఆయన ఆవిడను పేరుతో పిలవడం ఆ రోజుల్లో గొప్ప సంచలనం. సంప్రదాయాన్ని ధిక్కరించడం. అలాంటి ఉత్తమ ఇల్లాలు 1961లో ఇహలోక యాత్ర చాలించారు. ఆవిడ పేరు మీద అన్నపూర్ణ ప్రచురణలు అనే సంస్థను ప్రారంభించి ధర్మారావు ‘సాహిత్యమొర్మరాలు’ గ్రంథరూపంలో వెలుగులోకి తెచ్చారు. అవన్నీ సాహిత్యపరమైనవి. కాగడా, జనవాణి పత్రికలలో ప్రచురితమైనవి.

‘తాతాజీ ప్రచురణలు’ పేరుతో స్థాపించిన సంస్థ (1962) పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు ముద్రించారు. నాటకాల సంపుటి ప్రచురించారు. ‘ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ’ పేరుతో అంతకు ముందు తాను రాసిన వ్యాసాలను సంకలనం చేసి ప్రచురించారు. ‘పాతపాళీ’ ప్రచురణ మళ్ళీ జరిగింది. తాతాజీ మకుటాయమానమైన కృషి- చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసా’నికి వ్యాఖ్యానం. అది ‘హృదయోల్లాస వ్యాఖ్య’ పేరుతో జనహృదయోల్లాసంగా వెలువడింది. తాపీ ధర్మారావు బహుముఖ కృషి ఇలా పత్రికా రంగంలో, సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో విస్తరించింది.
ఆయన సినీ రంగంలో దాదాపు ఇరవై ఏళ్ళపాటు నలభై చిత్రాలకు రచనా సహకారం అందించారు. సినీ జర్నలిజంలోనూ ఆయన తన ముద్ర చెరగకుండా ఉండేలా చేసుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టుల్ని- మాటలు, పాటలు- గ్రంథరూపంలో ప్రచురిస్తే ఆయన వ్యక్తిత్వం గురించి మరింత విశదంగా తెలుస్తుంది. గ్రాంథిక భాషావాదిగా అరంగేట్రం చేసినా, వ్యావహారిక భాషా వాదిగా ఆయన రచనలు చిరకాలం ఉంటాయి.

24, ఏప్రిల్ 2013, బుధవారం

మందస లో ప్రాచీన ఆలయం

వాసుదేవ ఆలయం
సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినది గా భావిస్తున్న వాసుదేవ ఆలయం నిర్మాణానికి సం బంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. ఎర్రని ఇసుక రాయితో ఒరిస్సా శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. గత శతాబ్ధం చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రంగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించాయి.

ఆలయ చరిత్ర: ఆ కాలంలో మందసా రామానుజులనే ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశి వరకు కూడా పర్యటించి పలు వురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మానపత్రాలను పొందారట. మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారి గు రువు పెద్దజీయరు స్వామివారు, వారి మిత్రులు గోపా లాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది.వారిని ఆదరించిన మందసా రామా నుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు. నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రిం చిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కలవచ్చినది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వాసుదేవ పెరుమాళ్‌ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేయించి, వారు కూడా చేసినారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.

కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరా దరణకు గురి అయ్యి పూర్తిగా శిధిలావస్థకు చేరు కుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది. సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది. ప్రస్తుతం కేవలం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయగోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహు ళ్యానికి దూరంగా ఉండిపోయింది.ఈ సమయంలో 1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారు ఆలయ సందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించా లని సంకల్పించారు. అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకు ని, ఒరిస్సా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆల యాన్ని పునర్నిర్మింపచేసారు.

గురువు పెద్దజీయరు స్వామి వారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకోబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒరిస్సా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ తాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆల యం తప్పక సందర్శించతగినది.దగ్గరలో ఉన్న స్టేషన్‌ పలాస (18 కిమీ). జాతీయ రహ దారి 5 నుండి కేవలం 5 ి.మీ.లు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కి.మీ.లు. విశాఖపట్నం నుండి 200 కి.మీ.లు.

14, మార్చి 2013, గురువారం

ఇచ్ఛాపురం

సంబరానికి సన్నద్ధమవుతున్న స్వేచ్ఛాపురం
Swatchavathi స్వేచ్ఛావతి అమ్మవారి పేరు చెబితే ఇచ్ఛాపురమే గుర్తొస్తుంది. ఆంధ్రా ఒడిషాలతో పాటు దక్షిణ, ఉత్తర భారతానికి సరిహద్దు పట్టణం ప్రసిద్ధి గాంచిన ఇచ్ఛాపురం ఒక నాటి స్వేచ్ఛాపురమే. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి కొలువున్న పట్టణంలో పుష్కరకాలం తరు వాత భారీ ఎత్తున ఉత్సవాలు జరిపించేందుకు గ్రామ పెద్దలు కంకణం కట్టుకున్నారు. 2001 లో రాష్ట్ర చరి త్ర పుటల్లో ప్రత్యేక స్ధానాన్ని దక్కించుకున్న ఇచ్ఛాపు రం అందుకు తలదన్నేలా మరో నాలుగింతల బడ్జెట్‌ తో పెద్దలు రంగంలోకి దిగారు. 2001 అనంతరం ప్రతీ ఐదేళ్లకొకసారి ఉత్సవాలు గ్రామశాంతి కోసం నిర్వహించ తలపెట్టినప్పటికీ పరిస్థితులు సహకరించ కపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. పుష్కరకాలా నికి అమ్మవారి ఆమోదం లభించడంతో ఉత్సవాలతో శాంతింప జేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దఫా ఉత్సాహంతో 108మంది ఉత్సవకమిటీ సభ్యులు న డుంబిగించారు. మార్చి 22న శుభరాట ద్వారా కార్య క్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 22 నుండి 21 రోజులు పాటు ఉత్సవా లను నిర్వహించేందుకు అధికారుల నుండి అనుమతులు పొందేందుకు పెద్దలు సిద్ధమౌతున్నారు.

రక్తధారతో అమ్మవారి జననం
ఇచ్ఛాపురం గ్రామదేవతగా పూజలందుకుంటోన్న శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు రక్తధారతో జన్నించి నట్లు కథనం ప్రచారంలో వుంది. కొన్ని శతాభ్ధాలకు పూర్వమే అమ్మవారు ఈ గ్రామంలో వెలసినట్లు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో కొన్నాళ్లు విపరీతమైన కరువుకాటకాలు ఏర్పడి, కలరా, మశూచి వ్యాధులు ప్రబలడంతో ప్రతీ వీధిలో చిన్నాలు, పెద్ద లు పెద్దసంఖ్యలో మృతిచెందేవారు. అప్పట్లో వేరేదారిలేక చాలా మంది ప్రజలు, గ్రామం, ఇళ్లు విడిచిపెట్టి ప్రాణభీతితో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు.

ఓ వ్యక్తి మాత్రం గ్రామం ఎడారిగా మారినప్పటికీ శ్రమను నమ్ముకుని దైవ భక్తితో అక్కడే వుండిపోయాడు. తనకున్న పొలాన్ని సేద్యం చేస్తుండగా ఒకనాడు నాగలి భూమిలో ఇరు క్కుంది. అతుక్కుపోయిన నాగలిని బయటకు తీసే ప్రయత్నించిన రైతు చెమటలు పట్టి భయాందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వున్న రైతులను కేకలు వేసి సాయం చేయమని కోరగా వారు నాగలి ని బయటకు తీస్తుండగా చివరిభాగం నుండి రక్తం ధార గా చిమ్మడం మొదలుకావడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ వింత చూసేందుకు వచ్చిన గ్రామస్ధులు నాగలిపై చేసే సాహసం చేయలేక, ఎద్దులను ట్లు విప్పి పంపేసి నాగలిని అక్కడే విడిచిపెట్టి వెనుదిరిగారు. అంతా భగవంతునిపై భారం వేసి ఆ రాత్రి నిద్రపోయారు.

ఓ గ్రామపెద్దకు ఆ రాత్రి కలలో బంగారుకాంతితో మెరుస్తూ అలంకార భూషితై , శంఖు, చక్ర, గదాపద్మ , ఖడ్గ శూలపాశ దండములతో, సింహవాహినై చిరునవ్వుతో ఓ దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరించింది. ‘పొలంలో రక్తం చిందించిన చోటనే, నేను శక్తిస్వరూపిణిగా, శ్రీ స్వేఛ్ఛావతి మాతగా ఆవిర్భవించి వున్నాని’ పలికింది. ‘ఇక మీరు భక్తిశ్రద్దలతో ఆరాధిస్తూ ప్రశాంతంగా, స్వేఛ్ఛగా, ఆరోగ్య సౌభాగ్యాలతో వెలగాలని దీవించి మాత అదృశ్యమైంది.

ఉదయాన్నే గ్రామపెద్ద లేచి కొంచెం భయం, ఆశ్చ ర్యం, ఆనందంతో విషయాన్ని గ్రామస్దులుకు తెలియ జేశాడు. దీంతో గ్రామస్దులు మేళతాళాలతో వెళ్లి పొలంలో నాగళి అతుకున్న చోట తవ్వగా అమ్మవారి విగ్రహాన్ని పోలిన రాయికి పెద్ద నాగలి గాటుతో రక్తంకారుతుండడం కన్పించింది. గ్రామస్దులు ఎంతో ధనవ్యయంతో చెక్కడపు శిలలతో, చక్కని శిల్పాలతో అక్కడే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆ దేవికి స్వేచ్ఛావతిగా నామకరణం చేసి గ్రామదేవతగా ప్రతిష్ఠించారు. అక్కడ నుండి గ్రామానికి స్వేచ్ఛాపుర మని పిలవసాగారు. వాడుక లో నేటి ఇచ్ఛాఫురంగా పిలవబడుతోంది.

సంబరాల కోసం
సంబరాల నిర్వహణ కోసం గ్రామలు పలువురు గత ఏడాది భేటీ అయ్యారు. గత ఏడాదే నిర్వహించాలని భావించారు. కొన్ని అడ్డంకుల దృష్ట్యా 2013 కు వాయిదా వేశారు. నిధుల సమీకరణ కోసం తొలుత ప్రతీ దుకాణంలో హుండీలు ఏర్పాటు చేసి విరాళాల సేకరణకు నాంది పలికారు. సుమారు 11 నెలలు కాలంలో రూ. 7 లక్షల మేర విరాళాలు సమకూరాయి.

ఉప్పలవీధిలో అమ్మవారికి స్థానం
ఏప్రిల్‌ 22 రాత్రి అమ్మవారిని మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా పట్టణంలోని ఉప్పలవీధిలో మండపం పై అమ్మవారిని వుంచుతారు. ఆ వీధికి చెందిన ‘నందికి’ వంశస్దులు అమ్మవారి కి కొన్ని తరా లుగా సేవలు చేస్తుండడంతో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆ వంశసు ్ధలకు చెందిన ఓ మహిళ కు అమ్మవారి ని తలపై ఊరేగించే అవకాశం కల్పిస్తారు.

సంబరాలతో మరింత అభివృద్ధి
vallam-patiసంబరాలతో స్వేచ్ఛావతి అమ్మవారి కటాక్షంతో గ్రామం మరింత అభివృధ్ధి చెందు తుందని ఆశిస్తున్నాం. అమ్మవారికి సంబరాల కానుకగా బంగారు ముఖాన్ని సిద్దం చేసి సంబరాల నాటికి అలంకరించే ఆలోచన చేస్తున్నాం. అమ్మవారి బంగారు 44 గ్రాములతో పాటు దాతల నుండి ఒక్కో గ్రాము ద్వారా సేక రించి 350 గ్రాములతో తయారు చేసే లక్షంతో పనిచేస్తున్నాం. ఆలయంలో సిసి కెమరాలతో స్ట్రాంగ్‌ రూం ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేశాం. అన్ని వర్గాలు సహ కరిస్తున్నారు.
వల్లంపాటి సుధీర్‌ కుమార్‌, ఉత్సవకమిటీప్రతినిధి





శాంతి స్వరూపిణి
Icha-(1)శ్రీ స్వేఛ్ఛావతి అమ్మవారు శాంతి స్వరూపిణి. శాంత స్వభావంతో భక్తులకు సుఖశాంతులు అందించే తల్లిగా కొలుస్తారు. చిన్నదేవాలయంగా వుండడంతో దాతల సాయంతో, భక్తుల విరాళాలతో అమ్మవారి ఆలయాన్ని 2003 లో అభివృద్ధి చేసి పునఃప్రతిష్ట చేశాం. ఇన్నేళ్లు సంబరాలు నిర్వహిస్తుం డడం గ్రామానికి ఎంతో శ్రేయస్కరం.
దుర్గాగురుస్వామి,నిర్వాహక కమిటీ ప్రతినిధి
| |