12, జులై 2017, బుధవారం

పైలా చంద్రమ్మ, శ్రీకాకుళం విప్లవ పోరాటంఉక్కు మహిళ చంద్రమ్మ
(త్యాగధనులను కీర్తించటం పోరు ధర్మం. వీర వనితలను స్పృశించటం ఉద్యమ అవసరం).విప్లవ శక్తులకు విశాలమైన పునాది కావాలంటే మహిళలు ఉద్యమాలలో సమాన భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిందే. ఈ పితృస్వామిక సమాజంలో, పురుషాధిక్య కుటుంబ వ్యవస్థలో స్త్రీలు బంధనాలు తెంచుకొని రాజకీయ ఉద్యమాలలోకి .. అందులోనూ దీర్ఘకాలిక సాయుధ పోరాటాలలోకి రావటం చాలా కష్టం. అలా వచ్చిన మహిళలు రాశిలో తక్కువైన ధైర్యసాహసాలు ప్రదర్శించటంలో కానీ, కష్టాలు భరించటంలో కానీ, త్యాగాలు చేయటంలో కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మహత్తర శ్రీకాకుళ ఉద్యమంలో కొండకోనల మధ్య చరిస్తున్న నిరుపేదల గోచిగుడ్డల చెమటను పీల్చుకొన్న ఎర్ర కాంతులలో స్త్రీలూ ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఆ వీరోచిత పోరాటంలో ప్రజలకు ఆత్మస్థైర్యం వెలిగించిన నెగడులు వారు. త్యాగధనులను కీర్తించడం పోరు ధర్మం. వీరవనితలను స్పృశించటం ఉద్యమ అవసరం.

1983వ సంవత్సరం. విజయవాడ రైల్వే స్టేషన్ రహస్యాన్ని దాచుకొని, భావోద్వేగాలను కనపడకుండా అణచుకుకొన్న విప్లవ కొరియర్ ముఖంలాగా ఉంది. రైలు ఉద్యమాన్ని గర్భాన మోస్తున్నట్లు నిండుగా, నింపాదిగా ప్లాట్ ఫారం మీదకు వచ్చింది. ఉన్నట్లుండి ఎక్కడనుండో నినాదాలు మొదలయ్యాయి. ఒక్క గొంతుని అనుసంధానిస్తూ వందల గొంతులు “విప్లవం వర్ధిల్లాలి.” “పైలా చంద్రమ్మను వెంటనే విడుదల చేయాలి.” విద్యార్ధులు దూసుకొని చంద్రమ్మ ఉన్న రైలుపెట్టెలోకి పోబోయారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇంతలో పోలీసు గార్డులతో ఘర్షణ పడి చంద్రమ్మ అనే ముప్పై రెండేళ్ళ మహిళ తలుపు దగ్గరకు వచ్చి పిడికిలి బిగించి విద్యార్ధులకు అభివాదం చేసింది. ఆమెను చూడటానికి విద్యార్ధులేకాక అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆతృత పడ్డారు. ఇలాంటి అనుభవమే పోలీసులకు విశాఖపట్నం నుండి హైదరాబాదు వరకూ ప్రతి స్టేషన్లో జరిగింది.

ఎవరీ చంద్రమ్మ? అప్పటికి ఎనిమిది సంవత్సరాలు నుండి జైలు జీవితం గడుపుతున్న విప్లవ ఖైదీ. అంతకు ముందు పదేళ్ళు శ్రీకాకుళంలో బాలలదళంలో, మహిళాదళంలో, తెగింపు దళంలో, గెరిల్లా దళంలో పని చేసి … ఇప్పటికీ రైతు కూలీ సంఘంలో పనిచేస్తున్న విప్లవకారిణి. తన ఎదుగుదలకు ఉద్యమ ఆలోచనలనే నీరుగా .. సిద్ధాంతమే రక్షక కవచంగా.. ప్రాణం, దేహం, రక్తం ఎరువుగా, ఎరుపుగా చేసుకొన్న ధీర మహిళ ఆమె. పాదాలు కోసుకొని పోయే ఎండిన చేలు, లక్ష్యాన్ని సవాలు చేస్తున్నట్లు ఉండే నిట్టనిలువు కొండలు, వందల మైళ్ళ సామూహిక నడక, తిండి లేని పగళ్ళు, నిద్ర హామీ ఇవ్వలేని రాత్రుళ్లు, పోలీసుల చిత్రహింసలు, అడుగు అడుగునా యుద్ధం … ఇదీ ఇప్పటి వరకు ఆమె జీవితం. పైలా వాసుదేవరావుగారితో ఆమెకు వైవాహిక జీవితం కంటే విప్లవ సహజీవనమే ఎక్కువ. వ్యక్తిగత జీవితాన్నికూడా విప్లవోద్యమానికి ముడివేసి ఈ రోజు వరకు ఆమె నడిచిన నడక .. నొప్పి పాదాలలో ప్రవహిస్తున్నా, ఆరోగ్యం ఆద్యంతం సహాయ నిరాకరణ చేసినా ఇప్పటి వరకు ఆగలేదు. ఆమె కధే మహత్తర శ్రీకాకుళ పోరాట కధ. ఒక నూతన గిరిజనుని ఆవిర్భావానికి శంఖానాదం ఊదిన శ్రీకాకుళ ధీర చరిత్రలో ఈ ఉక్కు మహిళ జీవిత పుట హుందాగా నిలుస్తుంది.

చంద్రక్కను ఇంటర్వ్యూ చేయటం కోసం మేము పలాస చేరేసరికి ఉదయం 7 అయ్యింది. పలాసలో కట్టిన పార్టీ ఆఫీసులోనే ఆమె నివాసం. జేగురు రంగద్దిన ఆ ఇంటి ముందు ఎర్ర గన్నేరు చెట్టు. అక్క సీరియస్ గా ఉంది. మమ్మల్ని చూడగానే వంట మొదలు పెట్టింది. మధ్యలో మేము ఎందుకు వచ్చామో విచారణ చేసింది. పని ముగించుకొని స్నానం చేసి వచ్చింది అక్క. లావెక్కిన బోదకాలును స్టూలు మీద పెట్టుకొని “ఆ. ఇక అడగండి.” ఆదేశించింది. మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు తప్ప, అది ఇంటర్వ్యూలాగా కాకుండా ఆమె అంతరంగ ఆవిష్కరణలా జరిగింది. సంఘటనలను మననం చేసుకోవటానికి ఇంకో శ్రీకాకుళ పోరాట యోధురాలు జయక్క సాయం తీసుకొన్నది. తేదీలు, స్థలాల కోసం “మాధవా!” అంటూ ఎకెఎంఎస్ నాయకుణ్ణి పిలిచేది. ఆమె జీవితం ఆమె మాటల్లోనే…

కమ్యూనిజం ఆవరణలో గ్రామాలు. విప్లవోద్యమం వైపు తొలి అడుగు:

మా సొంతూరు శ్రీకాకుళం జిల్లా రాజాం. మాయమ్మ కావమ్మ. నాన్న చిన్నయ్య. మేము ఎనిమిది మంది సంతానం. ఆరు మాసాలు తింటే ఆరు మాసాలు తిండికి ఇబ్బందే. మా అన్నలు పెత్తందార్ల దగ్గర పాలేర్లుగా ఉండేవారు. నేను 1951లో నేను పుట్టాను. చిన్నప్పుడు బడికి వెళితే బడిలో మొక్కలకు నీళ్ళు తేలేదని మాష్టారు వేళ్ళు వెనక్కి తిప్పి కొట్టారు. అప్పటినుండి బడికి పోలేదు. చదువుకొన్న చదువు అంతా పార్టీ పెట్టిన రాత్రి పాఠశాలల్లోనే. నాకు పదకొండేళ్ళప్పుడు కమ్యూనిష్టులు మా ఊళ్ళో ఊరేగింపు చేసి, అమెరికా ప్రెసిడెంట్ జాన్సన్ దిష్టి బొమ్మను కాల్చారు. అప్పుడే పైలా మాష్టారిని మొదటిసారి చూశాను. ఆ సంఘటన జరిగాక ఊళ్ళో భూస్వాములకు, పేద ప్రజలకు మధ్య గొడవలు జరిగి రెండు పక్షాల వాళ్ళు జైలుకి వెళ్లారు. అప్పుడు బొడ్డపాడు, మర్రిపాడు, మాకనపల్లి గ్రామాలనుండి ప్రజలు వచ్చి జైళ్ల కెళ్లిన పేద కుటుంబాల పొలాలు కోసి పెట్టి వెళ్లారు. బక్కలు (బర్రెలు) కాస్తున్న నేను ఆ ఎర్ర జండాల కోలాహలం చూసి మా అమ్మను విషయం అడిగాను. “వాళ్ళంతా కమ్యూనిష్టులు, పేద ప్రజల కోసం పని చేస్తారు” అని చెప్పింది. అప్పుడే మా ఊళ్ళో సారా ఉద్యమం జరిగింది. కమ్యూనిష్టులు సారాకుండలు పగలగొట్టారు. “సారా తాగి ప్రజలు చెడిపోతున్నారు. అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు.” అని మాయమ్మ చెప్పింది.

సుబ్బారావు పాణిగ్రాహి మా ఊర్లో జముకల కధ చెప్పటానికి వచ్చాడు. నా జీవితంలో ఇప్పటి వరకు జముకుల కధ కలగ చేసిన ఉత్తేజం ఇంకే కళా రూపం కలగ చేయలేక పోయింది. ప్రజలపై జరిగే దోపిడి ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో కళ్ళకు కట్టినట్లు కధలో చెప్పేవాళ్ళు. నాకు పదిహేను ఏళ్లప్పుడు (1966) 1500 గిరిజనులతో శ్రీకాకుళంకు ఆకలి యాత్ర జరిగింది. గిరిజనులు ఏజన్సీ ప్రాంతం నుండి యాభై కిలోమీటర్లు నడుచుకొంటూ వచ్చారు. మధ్యలో మా గ్రామాల్లో సభలు పెట్టి వాళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు. ఆ ఆకలియాత్రకు మేమూ వెళతామని ఏడిస్తే చిన్న వయసని మమ్మల్ని తీసుకొని వెళ్లలేదు. సారా వ్యతిరేక ప్రచారం, కూలి రేట్ల పెంపు కోసం ప్రచారం మేము చేసేవాళ్లం. నేను మొదట బాలల సంఘంలోనూ, తరువాత మహిళా సంఘంలోనూ ఉన్నాను. అంకమ్మది (తరువాత ఈమె ఉద్యమంలో అమరురాలు అయ్యింది) మా ఊరే. మేమిద్దరం జతగా ఉండేవాళ్లం. ఆమె నాకంటే రెండేళ్ళు పెద్దది.

ఒకనాడు మహిళా సంఘం పని మీద బాగా ముస్తాబు అయ్యి పూలు పెట్టుకొని మర్రిపాడు బయలుదేరాము. సుబ్బారావు పాణిగ్రాహి మాతో ఉన్నాడు. మర్రిపాడు గోర్జీలోకి రాగానే ఆయన మమల్ని ఆపి “మీరు ఏ పని మీద ఇక్కడకు వచ్చారు?ఈ ముస్తాబులు ఏమిటి?” అని ప్రశ్నించాడు. విప్లవ ప్రచారానికి వెళుతూ, ఇతరత్రా ఆకర్షణలు కలిగించకూడని, నిరాడంబరంగా ఉండాలని ఆయన భావం. అందరం ముఖ ముఖాలు చూసుకొని పూలు తీసేసి డొంకలో పడేశాము. ఆనాటి నుండి తరువాత నేను ఎప్పుడూ పూలు పెట్టుకోలేదు, అలంకరణలు పూర్తిగా మానేశాను.

1967 ప్రాంతంలో పెదఖర్జ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు గిరిజనుల ఇళ్ళ మీద దాడి చేసి వారి సాంప్రదాయ ఆయుధాలు అయిన తుపాకులను, బల్లాలను ఎత్తుకొని పోయారు. మేము ఉద్దానం గ్రామాల్లో తిరిగి వారికి ఆయుధాలు సేకరించి ఇచ్చాము. దాదాపు అప్పుడే ప్రజా ప్రతిఘటన పోరాటం ప్రారంభం అయ్యింది. ఇళ్ళను, కుటుంబాలను వదిలి “తెగింపు సంఘాల”లో చేరాలని పిలుపు వచ్చింది. నేనూ, అంకమ్మ తెగింపు సంఘంలో చేరాము. ఆ సమయంలోనే గరుడభద్ర భూస్వాముల పంటలను కోసి పేదప్రజలకు పంచాలని నిర్ణయం జరిగింది. బొడ్డపాడులో 1968 నవంబరు 23న మహిళా సంఘం సమావేశం జరిపి మర్నాడు ఉదయం బొడ్డపాడు, మర్రిపాడు, రాజాం, అక్కుపల్లి మొదలైన గ్రామాల్లో తిరిగి విప్లవ రాజకీయాలను ప్రచారం చేయాలని చెప్పారు. అందులో భాగంగా మహిళలం అందరం గరుడభద్ర చేరగానే ఊరి భూస్వాములు పంచాది నిర్మల జాకెట్టు వెనక నుండి పట్టుకొని చింపి వేశారు. భూస్వాములకు మాకు ఘర్షణ జరిగింది. మేము వెనక్కి వచ్చేశాము. విషయం తెలుసుకొని అన్ని గ్రామాల నుండి జనం వచ్చేశారు. ఊరిగింపు చేసి దాడి చేసిన వారి మీద ప్రతి చర్య చేయాలని అనుకొన్నాము. వాళ్ళు కూడా కర్రలతో సిద్ధంగానే ఉన్నారు. మా వాళ్ళకు దెబ్బలు తగిలాయి. 500 మంది కలసి భూస్వామి పొలం కోత కోసి ధాన్యం స్వాధీనం చేసుకొన్నారు. మేమంతా కొడవళ్ళు, మిరప్పొడి పట్టుకొని దాడికి సిద్ధంగా ఉన్నాము. కోత అయిపోయాక పోలీసులు వచ్చారు. ఆ రాత్రికి బయటకు వెళ్ళి పడుకొన్నాము. తరువాత వేరే ప్రదేశాలలో రక్షణ తీసుకోమని కబురందింది. ఇక ఇల్లు వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.


అజ్ఞాత జీవితం .. శరీరానికే, ఆచరణకు కాదు.

నేనూ అంకమ్మ రాయవలస అనే ఊరు వెళ్ళాము. అక్కడ పగలు కూలికి వెళ్ళేవాళ్ళం. రాత్రికి చోళ్ళు ఇసరటం, దంచటం చేసే వాళ్ళం. రాత్రిళ్ళు తోటలో నిద్రపోయేవాళ్ళం. ఊరి వాళ్ళకు అర్ధం అయ్యి మమ్మల్ని సరండర్ చేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాలు గ్రహించి “రేపు వస్తాము.” అని చెప్పి తప్పించుకొని పోయాము. రిట్టపాడు వెళితే కొద్దిగా అన్నం వేశారు. అక్కడనుండి వజ్రకొత్తూరు వెళ్లాము. అక్కడ మూడు రోజులు ఉన్నాము. అక్కడికి కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారని తెలిసి పడవ మీద అమ్మలపాడు వెళ్ళాము. వాసు మాష్టారు వాళ్ళు మమ్మల్ని ఆ ఊరులో వదిలేసి ఎక్కడకు వెళ్ళారో తెలియదు. ఆ ఊర్లో అంకమ్మ వాళ్ళ చుట్టాలు ఉన్నారు. అక్కడా మా గురించి గోల అయ్యింది. తిట్లు, చీవాట్లు. ఏమయితే అది అయ్యిందని మేమిద్దరమే బయలుదేరి పూండి స్టేషన్ కి వచ్చాము. అక్కడ సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది కృష్ణమూర్తి రైలు దిగి చాటుగా ఉన్నారు. వాళ్ళను చూడగానే సంతోషం అయిపోయింది. “దొరికినారు రా.” అనుకొన్నాము. మమ్మల్ని చూసి వాళ్ళు “ధైర్యంగా ఉండండి. భయపడకండి.” అంటూ నాలుగు రాజకీయాలు చెప్పేశారు. నాయకులకి రాజకీయాలు కరువా చెప్పటానికి, చెప్పేశారు. కాసిని డబ్బులు కూడా ఇచ్చారు. వాళ్ళకే ఎక్కడా టికానా లేదు. అప్పటి పరిస్థితుల్లో పార్టీ మమ్మల్ని వెతుక్కోవటం కాదు. మేమే పార్టీని వెదుక్కొనే వాళ్ళం.

మళ్ళీ రాయవలస వచ్చి పొలం పనులు చేసుకొంటూ నెల రోజులు ఉన్నాము. ఒకే చీర, ఒకే లంగా, ఒకే జాకెట్టుతో అన్ని రోజులు గడిపాము. ఈ లోగా అంకమ్మ వాళ్ళ నాన్న వచ్చేశాడు. “మీ మీద కేసులు లేవు. సరెండర్ చేస్తామని” అన్నాడు. సరే అని చెప్పి ఆయనకు అన్నం పెట్టి నిద్రపుచ్చి మామిడి అప్పలసూరి గారి ఊరు కోవర్తి పారిపోయాము. అక్కడ అప్పుడే దాడి జరిగి డా. మల్లికార్జున్ కి , డా. భాస్కర్ కి దెబ్బలు తగిలాయి. మమ్మల్ని లచ్చమ్మ చూసింది. లచ్చెమ్మ, దిగుమతి కమలమ్మ, సంపూర్ణ, వరాలు వీళ్ళంతా మా గురువులు. నెల రోజులు తరువాత బట్టలు మాకు వేరేవి దొరికాయి. కడుపు నిండా అంబలి దొరికింది. తిన్న తరువాత మమ్మల్ని చెరుకు తోటలకు పంపించేసింది. మరునాడు టిక్కెట్ తీసి మమ్మల్ని పార్టీ వాళ్ళే బారువా పంపేశారు. ట్రైన్లో అందరూ తెలిసిన వాళ్ళే. భయపడి ఇద్దరం పాయఖానలో దూరాము. కంచిక స్టేషన్ లో దిగిపోయాము. అక్కడి తామాడ గణపతి తోడల్లుడి ఇంటికి వెళితే అప్పటికే అక్కడ పోలీసులు దాడి చేసి ఉన్నారు. వాళ్ళను కొట్టేసి నానా భీభత్సం చేసి ఉన్నారు. ఇక మాకు వాళ్ళు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. లోపలికి రానివ్వలేదు. వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం పెట్టి, మాకు కూర్చోటానికి జాగా ఇవ్వమని బతిమలాడాము. రాత్రంతా అలాగే కూర్చొని ఉన్నాము. మూడు గంటలకే మమ్మల్ని వెళ్లిపోమ్మని బలవంతం చేశారు. అంత రాత్రి 16 కిలోమీటర్లు నడిచి బారువా చేరుకొన్నాము. పందుల రామయ్యగారి ఇంట్లో తలదాచుకొన్నాము. నాకు జ్వరం మొదలైయ్యింది. మా తాతగారి ఇంటికి వెళ్ళాను. మా పిన్ని నన్ను అటక మీద దాచి పొద్దున్నే మొగిలిపాడు తీసుకొని వెళ్ళింది. అక్కడ మా అక్క నన్ను తిట్లకు లంకించుకొన్నది. నా కోసం మా అమ్మను అరెస్టు చేశారని అప్పుడే తెలిసింది. ఒక జత బట్టలు కూడా ఇవ్వకుండా నన్ను బొడ్డపాడుకి తరిమింది మా అక్క. బొడ్డపాడులో మన బొడ్డప్పారావు గారింటికి చేరాను. వాళ్ళు ఇంత బాండ్రు కప్పను పట్టుకొని వండుకొంటున్నారు. కమ్యూనిష్టులంటే ఏది పెడితే అది తినాలని అన్నారు. నేను తినలేక పోయాను. ఊరి నుండి బట్టలు తెప్పించారు నాకు.

రెండు మూడు రోజుల తరువాత మా అమ్మ బైలు మీద బయటకు వచ్చి నా కోసం వచ్చింది. నన్ను తిట్ల మీద తిట్లు. మనోళ్ళు ఆమెకు రాజకీయాలు చెప్పాలని ప్రయత్నించారు. ఆమె వినలేదు. ఇద్దరం ఎదురెదురుగా తిండికి కూర్చోన్నాము. ఆమె తినకుండా నన్ను శాపనార్ధాలు పెడుతుంది. సుబ్బారావు పాణిగ్రాహి “ఇంకేమైనా ఉందా? ముందు తిను.” అన్నాడు. ఆమె తినలేదు. నేను శుభ్రంగా తినేశాను. నన్ను మాకనపల్లి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించింది. ఊరి పొలిమేర్ల దాకా వెళ్ళి వెనక్కి వచ్చేశాను. నేను మా తాతగారి ఊరికి బయలుదేరినపుడే అంకమ్మను అక్కడ నుండి తప్పించేశారు పార్టీ వాళ్ళు. నేను తిరిగి వస్తానని వాళ్ళు నమ్మలేదు. “ఇంకెప్పుడూ పార్టీకి తెలియకుండా వెళ్ళను.” అని నేను చెప్పాక నన్ను, అంకమ్మను, సుబ్బారావు పాణిగ్రాహి తమ్ముడు పిచ్చి పంతుల్ని, డాక్టరు కామేసాన్ని బేతాళపురంలో ఇల్లు తీసుకొని ఉంచారు.అక్కడ డాక్టరు వృత్తి చేస్తూ మూడు మాసాలు ఉన్నాము. వచ్చిన డబ్బులో సగం పార్టీకి ఇచ్చేవాళ్ళం. వృత్తి చేసి కుటుంబాలని పోషించటం కాదు పార్టీని పోషించారు నాడు విప్లవకారులు. బొడ్డపాట్లో భూస్వాములను కొట్టి ఉంగరాలు తెచ్చి అమ్మి ఏదో కరపత్రం వేశారు మనవాళ్ళు. అప్పుడప్పుడు నాయకులు వస్తుండే వాళ్ళు. రాత్రిళ్ళు వచ్చి మాట్లాడుకొని పోయేవాళ్ళు. అక్కడ నుండి కూడా బయట పడి చెట్లు చేమలెంబడ తిరిగాము.

బాతుపురం చర్య – దళంలో స్థానం.

నిజానికి అది బాతుపురం దాడి కాదు. బారువా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలనుకొన్నాము. స్టేషన్లో ఎక్కువ పోలీసులు ఉన్నారని వార్త రావటంతో తిన్నగా జలంధరకోట చేరాము. అప్పటికి చెప్పులు లేక నా కాళ్ళు వాసిపోయి ఉన్నాయి. అక్కడ పొలాలు మరీ మొండిగా, పగుళ్ళు యిచ్చి ఉండేవి. వాటిల్లో పడుతూ లేస్తూ మా ప్రయాణం జరిగింది. డా. భాస్కర్ వాచీ అమ్మి చోళ్ళు (రాగులు) తెచ్చి తోప (మాల్ట్ లాంటిది) కాసారు. అది కటిక చేదు. ఆకుల్లో పెట్టి యిస్తే తినలేక దాచేశాము. సుబ్బారావు గారు “తిన్నారా?” అనుకొంటూ వచ్చారు. చైనా పోరాటంలో చెప్పులు తిని బతికారని చెప్పి మమ్మల్ని మందలించారు. తరువాత రోజు బాతుపురం యాక్షన్ కి వెళ్ళాము. అక్కడ ఒక భూస్వామి యింటి మీదకు వెళ్ళాము. భూస్వామిని కట్టేసి, ఇంట్లోకి చొరబడి అన్నీ స్వాధీనం చేసుకొన్నాము. ఈ యాక్షన్ లో నాదీ, అంకమ్మదీ సాహసమైన పాత్ర. మమ్మల్ని దొంగలు అనుకొని జనం వచ్చారు. పైలాగారు వాళ్ళకు “మేము కమ్యూనిష్టులమని” చెప్పారు. ఆ యింట్లో దోచుకొన్న బంగారంలో కొంతభాగం ఆ ప్రజలు తనఖా పెట్టిందే. అవన్నీ ప్రజలకు యిచ్చేశాము. వారు అప్పులు తీసుకొన్న ప్రామిసరీ నోట్లు చించేసాము. ధాన్యం ప్రజలకు పంచేసాము. తిరిగి వస్తుండగా అగస్మాత్తుగా అంకమ్మ మాతో లేదని గుర్తించాము. ఆమెను వాళ్ళు ఒక గదిలో బంధించారు. తిరిగి వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చాము. మేము కొంత దూరం వెళ్ళాక వాళ్ళ తుపాకీలు పేలాయి. వాళ్ళ దగ్గర తుపాకీలు కూడా ఉన్నట్లు మాకు తెలియదు.

ప్రజలకు ఇవ్వగా మిగిలిన బంగారంతో ఆయుధాలు కొనాలని అనుకొన్నాము. అక్కడ నుండి రెండు దళాలుగా చీలిపోయాము. స్థానిక దళం వెళ్ళిపోయింది. నేను రెండో దళంలో ఉండిపోయాను. స్త్రీలను బయట దళాల్లోకి మామూలుగా తీసుకొనే వాళ్ళు కాదు. నేను కొద్దిగా చలాకీగా కొండలు ఎక్కేదాన్ని. పోలీసులు మాటు కాశారు మా కోసం. బుచ్చయ్య చేతి బాంబు విసిరి దళాన్ని రక్షించాడు. సిఐకి చెయ్యి విరిగింది. బుచ్చయ్య అరెస్టు అయ్యాడు. మేము చుట్టూ ఒరిస్సా మీద నుండి మహేంద్ర తనయ మీదుగా కొండలాగం తిరిగి వచ్చాము. మాకు ఒరియా తెలియదు, మూతి వంకర పెట్టి మాట్లాడాము. మా దగ్గర బంగారం ఉంది కానీ తిండి లేదు. నాతో సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, పంచాది కృష్ణ మూర్తి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కొండలాగంలో చిలకమ్మ మాకు రక్షణ యిచ్చింది. అక్కడ నుండి సముద్రతీర గ్రామాలకు చేరుకొని వి‌ప్లవ ప్రచారం మొదలు పెట్టాము. కవిటుద్దానం, ఒరిస్సా ఈ ప్రాంతాలలో కూడా తిరిగాము. ఒక రోజు మేము ఒక సాలెలో (పాకలో) పడుకొని ఉంటే అప్పారావు వాళ్ళ అమ్మ మేమంతా ఆమె కొడుకును పాడు చేస్తున్నామని భావించి అగ్గి పెట్టేసింది. అక్కడనుండి తప్పుకోగలిగాము.(రెండో భాగం)

మా పెళ్ళి కాలానికి ముఖ్యనాయకులు పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, అంకమ్మ, సరస్వతి, పంచాది నిర్మల, డా. భాస్కర్ అమరులయ్యారు. శ్రీకాకుళ ప్రాంతంలో అత్యంత నిర్బంధం కొనసాగుతోంది. ఉద్యమం నిస్తభ్ధతకు గురి అయ్యింది. మాష్టారు (పైలా వాసుదేవరావుగారు) నన్ను పెళ్ళి చేసుకోమని అడిగారు. మా యిద్దరికి దాదాపు ఇరవై ఏళ్ళు వయసు తేడా ఉంది. ఉద్యమంలో పని చేసే అమ్మాయినే చేసుకోవాలని మాష్టారు నలభై ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం ‘ఆహా ఊహూ’ అనుకొన్నాము. ఈ లోపల పార్టీ ఆల్ ఇండియా మహాసభలు కలకత్తాలో జరిగాయి. ఆ మహాసభలు అయ్యాక కొండలోగాం ప్రాంతంలో తెంతులగాం కొండల్లో మే 24న మా పెళ్ళి, ఒక సమావేశం అనంతరం జరిగింది. (పెళ్ళి ఏ కొండ మీద జరిగిందనే విషయం మీద కాసేపు జయమ్మ, చంద్రమ్మల మధ్య వాగ్వివాదం జరిగింది) మావిడి అప్పలసూరిగారే మా పెళ్ళి పెద్ద. కొండ తీగ పూల దండలు మార్చుకొని మావో సూక్తులు ప్రమాణాలుగా పలికాము.

మాతృత్వం- రహస్యోద్యమం

అప్పట్లో నేను చలాకీగానూ కొండలు ఎక్కటంలో చురుకుగా ఉండేదాన్ని. భూస్వాముల మీద జరిగిన అన్ని యాక్షన్ లలో నేను ఉండేదాన్ని. ఉద్దానంలోకానీ, కొండల్లోగాని ఉండే కుటుంబాలు అన్నీ నాకు సుపరిచితాలే.

పెళ్లి అయ్యాక కూడా ఇద్దరం వేరు వేరు దళాల్లో ఉన్నాము. అరుణ కడుపులో పడింది. అప్పటికే జయమ్మ, డా.మల్లిక్ ల పెళ్ళి జరిగి మల్లిక్ అమరుడయ్యాడు. జయమ్మకు పార్టీ సూచనలతోటే అబార్షన్ జరిగింది. నన్ను కూడా అబార్షన్ కోసం తెలిసిన డాక్టరు దగ్గరకు పంపారు. కానీ 7వ నెల వచ్చి ఉండటం వలన ఆయన ప్రమాదమని అబార్షన్ చేయలేదు. ఇక ప్రసూతి కోసం నేను బయటకు రావాల్సి వచ్చింది. తలదాచుకోవటానికి చాలా ఊర్లు తిరిగాను. ప్రకాశం జిల్లా చీరాల, పలుకూరు, సింగరాయకొండ … ఇంకా ఏటి వడ్డు గ్రామాలు చాలా తిరిగాను. గుంటూర్లో నాజరు ఇంట్లో కూడా ఉన్నాను. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య గర్భవతి అవ్వటంతో నేను అక్కడ ఉండకూడదని మళ్ళీ పంపించివేశారు. నా డెలివరీ దగ్గర పడ్డాక చిన్నాపరేషన్ (పిల్లలు పుట్టకుండా) కూడా చేయించాలని అనుకొన్నాము. కొల్లా వెంకయ్య కొడుకు రాజమోహన్ అప్పుడు డాక్టరుగా హైదారాబాద్ లో ఉండేవారు. ఆయన నన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. మొగుడు తాగుబోతు, డ్రైవరు, ఈమె ఆయన రెండో భార్య అని చెప్పి చేర్పించారు. చేర్పించి వదిలేసి వెళ్ళిపోయారు. ఒక రకంగా మర్చిపోయినట్లే. డెలివరీ, ఆపరేషన్ అన్నీ అయిపోయాయి. బిడ్డను చేరదీసిన వాళ్ళు లేరు. చిన్న బట్ట ఇచ్చిన వాళ్ళు లేరు. నాకాడకొచ్చి అన్నం పెట్టినోళ్ళు లేరు. నా బాధలు గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. పార్టీ పట్టించుకొనే స్థితిలో లేదు. పక్క బెడ్డు వాళ్ళు నాకు గుడ్డలు ఇచ్చారు. నర్సమ్మలు పిల్లకు గౌన్లు తెచ్చి ఇచ్చారు. ఆకలి బాగా వేసేది. వాళ్లిచ్చే బ్రెడ్డు ఏమూలకు సరిపోయేది కాదు. కుట్ల దగ్గర చీము పోసింది. అలాగే ఉన్నాను.

ఒక రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు రాజమోహన్ ఊడిపడ్డట్లు వచ్చారు. “అయ్యో. నేను చెప్పినా పార్టీ వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. బయలుదేరు అమ్మా.” అన్నారు. ఆసుపత్రిలోనే ఎక్కువ రోజులు ఉంటే అనుమానం వచ్చి అరెస్టు చేస్తారు. ఆయనతో బయలుదేరాను. ఆటోలో కొద్ది దూరం వెళ్ళి తరువాత నడిచి వెళ్ళాలి. బాగ్ ను ఒక పక్కనా, పాపను ఒక పక్కనా వేసుకొని నడుస్తున్నాను. ఆయన సాయం చేస్తానని అనలేదు. డాక్టర్ అవటానో, ఎవరికైనా అనుమానం వస్తుందని అనుకొన్నారో తెలియదు. కాళ్ళకేదో అడ్డం పడి దుబ్బున పడిపోయాను. అరుణ కావ్, కావున ఏడ్చింది. ఆయన వచ్చి “లేవండమ్మా.” అని లేపారు. అక్కడకు దగ్గరే ఒక సానుభూతిపరుల ఇంటికి తీసుకొని వెళ్ళారు.

అక్కడే కొన్ని రోజులు ఉండాలని అన్నారు. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ ఉండాలి కదా అన్నాను. మన పార్టీ వాళ్ళనయితే పోట్లాడగలను. బయట వాళ్ళను ఏమి అనగలను? ఆ యింటి ఆమె బువ్వ కాడ మాత్రం బాగానే పెట్టేది. కానీ పిల్ల పనిలో సాయం చేసేది కాదు. నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఒక రోజు అన్నం తినటానికి కూర్చోగానే అరుణ ఏడుపు మొదలు పెట్టింది. ఆకలవుతూ ఉండింది. ఎత్తుకొనే తింటున్నాను. పిల్ల పాస్ కు వెళ్లింది. ఆ పాస్ అన్నంలో పడ్డాయి. ఆ అన్నం వద్దంటే ఏమంటారో ఏమో, మళ్ళీ పెడతారో లేదో అని అలాగే తినేశాను.

మాష్టారు అప్పటికి చాలా బాధ్యతలలో కూరుకొని పోయారు. ఎప్పుడైనా ఒక ఉత్తరం రాసి పంపేవారు. ఆ యింట్లోనే నెల గడిపిన తరువాత ఒక డెన్ కి చేర్చారు. అక్కడ ఐదు నెలలు వరకు ఉన్నాను. అక్కడ కొండపల్లి సీతారామయ్య, కొల్లిపాటి నరసింగరావు, కె. సత్యమూర్తి, రవూఫ్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఆయుధాలు కూడా ఆ డెన్ లో ఉండేవి. కొండపల్లి సీతారామయ్యను నేను ‘నాన్న’ అని పిలిచేదాన్ని.

మా దగ్గర పైసలు ఉండేవి కావు. పావలా ఇస్తే బోలెడన్ని ఉల్లిపాయలు వచ్చేవి. ఆ ఉల్లిపాయలతోనే కూర. డెన్ లో ప్రతివాళ్ళూ కొండపల్లితో సహా పిల్ల పెంపకానికి సహకరించేవారు. బయటకు పోయినా కడిగేవాళ్ళు. ఒక రోజు డెన్ లో అందరూ బయటకు వెళ్ళటానికి సిద్దం అవుతున్నారు. “ఎందుకు?” అని అడిగాను. వాసు మాష్టారు వస్తున్నారని అన్నారు. “ఆయన వస్తే మీరు ఎందుకు బయటకు వెళ్ళాలి?” అని అన్నాను. కొరియరు ముందు వచ్చారు. తరువాత మాష్టారు వచ్చారు. తలుపు తీసి మౌనంగా ఉండిపోయాను. ఇద్దరి మధ్య మాటలు లేవు. మాష్టారు పిల్లను చూడటానికి లైట్ కూడా వెయ్యనివ్వలేదు. నేను ఏడ్చాను. మాష్టారు కూడా బాధపడ్డారు. తెల్లవారి ఝామున నాన్న (కొండపల్లి) వచ్చారు. అప్పటిదాకా మేము మాట్లాడుకోలేదు. తెల్లవారి పిల్లను ఇచ్చేయాలి. నా సమ్మతంతోనే ఆ నిర్ణయం జరిగినా ఆ బాధను తట్టుకోలేక పోయాను. అసలు ముందు పిల్లను వుంచేసి నన్ను వెళ్లిపోమని చెప్పారు. కానీ నేను మాష్టారు రావాలి, మేమిద్దరం మాట్లాడుకోవాలి అని గట్టిగా చెప్పటంతో ఆయన వచ్చారు. ఇద్దరం మాట్లాడుకొన్నది ఏమీ లేదు. నాన్న వచ్చి నన్ను సముదాయించారు. అరుణను పెంచుకొన్న వారి పెద్ద అబ్బాయి (అత్తలూరి మల్లికార్జునరావు) కూడా ఆ డెన్ లో ఉండేవాడు. ఆయన ద్వారానే అరుణ వాళ్ళ యింటికి చేరింది. బట్టలు సంచిలో సర్ది పిల్లను పంపాము. మా అమ్మాయి అని చెప్పకుండా సత్యమూర్తిగారి అమ్మాయి అని చెప్పాము. తరువాత పిల్ల పత్తా గురించి చాలా సంవత్సరాలు ఆలోచించే అవకాశం రాలేదు.

అప్పుడే కొండపల్లిగారితో మాకు రాజకీయ విభేధాలు వస్తున్నాయి. పులి రామకృష్ణయ్య అక్కడ నుండి నన్ను తీసుకొని వచ్చారు. సింహాచలం స్టేషన్ లో నన్ను వేరేవారు రిసీవ్ చేసుకోవాలి. అయితే వాళ్ళు రాలేదు. ఆ రాత్రికి సింహాచలం కొండ ఎక్కి రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాము. మరుసటి రోజు రిట్టపాడు చేరాము. అక్కడికి చిట్టెమ్మ, రాంబాబు వచ్చి ఉన్నారు. తరువాత దళంకి చేరాను. మళ్ళీ పుల్లారెడ్డి పార్టీ నుండి విడిపోయే దాకా పాపకూ నాకూ సంబంధం లేదు. అప్పుడప్పుడు అడుగుతుండేదాన్ని చూడాలని. కుదిరేది కాదు.

కొండపల్లివారి నుండి విడిపోయి వేరే పార్టీ పెట్టుకొన్నాము. ‘విమోచన’ పేరు మీదనే ఆ పార్టీ చాలా రోజులు నడిచింది.

అక్కడ వాళ్ళు అరుణను చాలా బాగా పెంచారు. మా పిల్లని అందరికీ తెలిసి పోయింది. మా పిల్లను పెంచుతున్నందుకు వాళ్ళను రెండు సార్లు అరెస్టు చేశారు. కొట్టి జైలులో కూడా ఉంచారు. వాళ్ళ అబ్బాయి తెచ్చిన పిల్లగా యిష్టపడి వాళ్ళు అరుణను వదలలేదు. మా గురించి కూడా ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. అప్పటికే వాళ్ళకు ఎనిమిది మంది పిల్లలు. అయినా అరుణను గారాబంగా పెంచారు. పది చదివిన తరువాత ఆమె బాధ్యత మళ్ళీ పార్టీ తీసుకొన్నది. ముసలివాళ్ళం అయ్యాక మనకు మళ్ళీ పిల్లలు పుడతారని మాష్టారు జోక్ వేసేవాళ్ళు.

అరెష్టు – చిత్రహింసలకు లొంగని స్థిర చిత్తం

అది 1975వ సంవత్సరం. ఎమర్జెన్సీ ఇంకా పెట్టలేదు. కొండలోగాం ఏరియాలో కొండకు కొద్ది దూరంలో ఒక జీడి తోటలో నేను, కుమారన్న మరికొంత మందిమి ఉన్నాము. ఏదో విషయం మీద నాకు కుమారన్నకూ ఘర్షణ జరిగింది. వాసు మాష్టారు కూడా అప్పుడే వచ్చారు. ఆయన అక్కడకి వస్తారని కూడా నాకు తెలియదు. రాష్ట్ర కమిటీ సమావేశానికి వెళ్ళి అక్కడికి వచ్చారు. అప్పటికి పుల్లారెడ్డి పార్టీతో శ్రీకాకుళం కమిటీ విలీనం అయి ఉంది. మేము మాట్లాడుకొంటూ గంజన్నం తిన్నాము. మాష్టారు పిన్ను చేతి బాంబు తీసుకొని వచ్చి ఎలా ఉపయోగించాలో మాకు చెబుతున్నారు. అందరి దగ్గరా ఆయుధాలు ఉన్నాయి. ఎండ మీద పడి నీడకు జరుగుతూ ఆయుధాలకు కొద్ది దూరంలో ఉన్నాము.

ఇంతలో మందస పోలీసులు నాలుగు వైపుల నుండి తోటను ముట్టడించారు. మాష్టారు ముందు గమనించి ‘ఉష్, ఉష్’ అన్నారు. పోలీసులు కాల్పులు మొదలు పెట్టగానే మేము తలొక దిక్కు పరిగెత్తాము. మాష్టారు పరిగెడుతూనే తన చేతిలోని తుపాకితో కాల్చారు. పోలీసులు వెనక్కి తగ్గిన సమయాన్ని ఆసరాగా తీసుకొని అక్కడి కంచెను దాటి (దాదాపు 12 అడుగులు జంప్ చేసి) ఒక చెట్టు ఎక్కి కూర్చోన్నారు. కుమారన్న చేతికి తూటా దెబ్బ తగిలింది. అయినా ఆయన పారిపోగలిగారు. నేను పరిగెత్తేటపుడు కంచెలో నా చీర చిక్కుకొని పోయింది. పోలీసులు నన్ను పట్టుకోగలిగారు. గ్రామాల నుండి జనం వచ్చారు. అయితే ఎవరినీ నా దగ్గరకు రానివ్వలేదు. అక్కడే నన్ను కొట్టారు. మిగతా వారి గురించి చెప్పమని తుపాకి కాల్పులు గాలిలోకి జరిపారు. మాష్టారు నన్ను కాల్చివేశారని నిర్ణయించుకొని చెట్టు దిగి అక్కడ నుండి వెళ్ళిపోయారు. నన్ను చంపి వేశారనే వార్త మొదట పేపర్లో వచ్చింది. రాత్రి 12 గంటల వరకు నన్ను కొట్టి మందస తీసుకొని వెళ్లారు. అక్కడ కూడా బూటు కాలితో కొట్టారు. తెల్లవారు జామున 4 గంటలకు పక్కన కొండల్లోకి తీసుకొని వెళ్లారు. బట్టలు విప్పారు. అన్ని రకాలుగా బాధించారు. వళ్ళంతా రక్తం కారుతూ ఉండింది. “చేతులూ కాళ్ళు నరికి, చెట్లకు కట్టేసి మా విప్లవకారులను 360 మందిని మీరు చంపారు. అంతకంటే నన్ను మీరు ఏమీ చేయగలరు.” అని ప్రశ్నించాను. “మీకు అక్కచెళ్లెళ్ళు లేరా? అమ్మలు లేరా?” అంటూ పిచ్చి పిచ్చిగా తిట్టాను. తరువాత నాకు స్పృహ పోయింది. మెలుకవ వచ్చేసరికి ఒక ఎస్సై ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాను. మెన్సస్ అయి ఉన్నాను. మీద ఒక గుడ్డ కప్పి ఉన్నారు.

మరుసటి రోజు నన్ను పోలీసు స్టేషనుకి తీసుకొని వెళ్ళారు. ఆ గ్రామాలకు చెందిన ఒక వ్యక్తి నన్ను దూరం నుండి చూసుకొంటూ వెళ్ళాడు. నేను చనిపోలేదని బయట ప్రపంచానికి తెలిసిపోయింది. పెద్ద నాయకురాలు పట్టుబడిందని అప్పుడు ప్రకటనలు యిచ్చారు పోలీసులు. నా దగ్గర కొన్ని ఉత్తరాలు దొరికాయి వాళ్ళకు. వాటినిండా రాజకీయాలే. “ఇంత రాజకీయం ఉంటే అదెక్కడ చెబుతుందిరా.” అని పోలీసులు అనుకోవడం విన్నాను. వాసు మాష్టారు, కుమారన్న తప్పించుకోవటంతో నా విషయం ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకో పక్క కుట్ర కేసులో అరెస్టు అయిన ముద్దాయిలు జైలులో ఆందోళన చేస్తున్నారు. ఈ కారణాలన్నింటి వలన నన్ను వాళ్ళు ఎన్ కౌంటర్ చేయలేకపోయారు.

నన్ను కోర్టుకు హాజరు పరిచారు. బూర్గాం రాజు అప్పుడు లీగలుగా తిరుగుతున్నాడు. నాకు సహాయంగా వచ్చాడు. అంత నిర్భంధంలోనూ ఆయన పాత్ర మెచ్చుకోదగ్గది. కోర్టులో నాకు తెలిసినంత వరకు నినాదాలు యిచ్చాను. జడ్జికి నా వంటి దెబ్బలు చూపించాను. “పోలీసులు కొట్టకుండా ఉంటారా?” అన్నాడా జడ్జి. హాస్పటల్ లో నాకు చికిత్స చేయించి శ్రీకాకుళం తీసుకొని వెళ్ళారు. మా కామ్రేడ్ల సమాచారం, ఆయుధాల సమాచారం యిస్తే నాకు ఆస్తి, డబ్బు యిచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తామని అన్నారు. “మీరు పొట్ట కోసం ఉధ్యోగానికి వచ్చారు. మేము పోరాటం కోసం వచ్చాము. తుపాకి పడితేనే ప్రజలకు విముక్తి జరుగుతుందని మేము నమ్మి మేము అన్నిటికీ సిద్ధం అయి చేస్తున్నాము.” అని అన్నాను. ఆ రాత్రి నన్ను లాకప్పులో ఉంచారు. నా రెండు చేతులు గుంజకు కట్టేశారు. ఆ పక్కనే మల మూత్రల విసర్జన జరిగి ఉండింది. నరకం అనుభవించాను. రాత్రంతా మేలుకొనే ఉన్నాను. పోలీసులు మధ్య మధ్యలో వచ్చి నన్ను తిట్టేవాళ్ళు.

మరుసటి రోజు కలెక్టరు దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళారు. “మీరు బయట పెళ్ళి చేసుకొన్నారు. మేము పార్టీలో పెళ్లి చేసుకొన్నాము. నాకు మళ్ళీ పెళ్ళి చేస్తామని ఈ డిఎస్పీ, ఎస్పీ అనటం సమంజసమేనా?” అని అడిగాను ఆయన్ను. కలక్టరు బీహారువాడు. అనువాదకులు ఆయనకు నేనన్న మాటలు వివరించారు. ఆయన పోలీసులను మందలించాడు. అయినా మళ్ళీ నన్ను టెక్కలి తీసుకొని వెళ్ళి ఇదే సోది. స్టేషన్ ముందు జనం మూగారు. నాకు తెలిసిన పాటలు రెండు పాడాను. మరునాడు అడిషనల్ జడ్జి ముందు హాజరు పరిచారు.

జైలు జీవితం

తరువాత నన్ను సెంట్రల్ జైలుకు తీసుకొని వెళ్ళారు. నాకు హాండ్ కప్స్ వేసి తీసుకొని వెళుతుంటే, ఆ జైలులో అప్పటికే ఉన్న విప్లవ ఖైదీలు, పాండన్న, పులి రామకృష్ణ, మాలకొండయ్య .. వీళ్ళంతా జైలు ఎగిరిపోయేటట్లు నినాదాలు యిచ్చారు. నాపై దాదాపు యాభై కేసులు పెట్టారు. పధ్నాలుగేళ్ళు జీవిత ఖైదు పడింది నాకు. సంవత్సరం పాటు నాతో ఎవరికి ఇంటర్వ్యూ యివ్వలేదు. బట్టలు యివ్వలేదు. ఒకే దుప్పటి నలుగురం మహిళా ఖైదీలం కప్పుకొనే వాళ్ళం. ఉన్న ఒక్క జత బట్టలు రాత్రుళ్లు ఆ దుప్పటి కప్పుకొనే ఉతికి ఆరేసుకొనే వాళ్ళం. ఒకసారి మలేరియా వచ్చి వణికి పోతుంటే పోలీసులు దయ తలిచి ఒక శాలువా కప్పారు. నేను లోపల ఉన్నప్పుడు కూడా రెండు సార్లు ఎస్పీ వచ్చాడు. “అరుణను చదివిస్తాము. బాగా చూస్తాము.” అని ఆశ పెట్టబోయారు. “మా పార్టీ వాళ్ళు బాగానే చూసుకొంటారు. మీతో మాకు పని లేదు.” అని చెప్పాను.

జైలులో ఉంటూనే అనేక సార్లు కోర్టుల చుట్టూ తిరిగాను. మన రాజ్యం వచ్చేస్తుంది. జైలు గోడలు బద్దలు కొట్టి నన్ను బయటకు తీసుకొని వెళతారని అమాయకంగా అనుకొనేదాన్ని. జైల్లో ఉండగా అక్కడ కొన్ని సినిమా షూటింగులు జరిగాయి. నేను అక్కడ ఉన్నానని నన్ను చూడటానికి ఎన్టీ రామారావు, చిరంజీవి వేరు వేరు సందర్భాలలో వచ్చారు. నాకు ఏదో డబ్బు ఇవ్వటానికి ప్రయత్నించారు. బయట మా పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చందా యివ్వండి అని చెప్పాను. వాళ్ళేమి యిచ్చినట్లు లేదు.

నాకు ఆరోగ్యం బాగా ఉండేది కాదు. ఆరు నెలలకు ఒకసారి ఉస్మానియా తీసుకొని వెళ్ళే వాళ్ళు. జైలులోనాతో ఉండి వెళ్ళిన కళ్యాణకృష్ణ ఎన్నో ఏళ్ళగా నాకు పెరోల్ ఇవ్వలేదని విజయవాడలో వెళ్ళి కరపత్రం వేశారు. హైదారాబాద్ వెళుతుంటే నా గురించి తెలుసుకొని అన్ని స్టేషన్లలో నన్ను విద్యార్ధులు కలుసుకొనేవాళ్ళు.

1984లో పెరోల్ మీద బయటకు వచ్చి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాను. మాష్టారిని చాలా రోజుల తరువాత కానీ కలవలేక పోయాను. హైదారాబాదులో ఆయుధాలు బాగు చేయించటానికి వెళ్ళి నల్గొండ దగ్గర పట్టుబడి మళ్ళీ జైలుకు వెళ్ళాను. అప్పుడు నన్ను విక్రమన్ననూ విపరీతంగా కొట్టారు. తరువాత ఇంకో సారి టెక్కలిలో అరెస్టు అయి మూడు నెలలు ఉన్నాను. మొత్తం నా జీవితంలో పదమూడు సంవత్సరాల వరకు జైలులోనే ఉన్నాను.


ప్రశ్న : గిజనులలతో మీ సహవాసం గురించి చెప్పండి.

చంద్రక్క: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు మా కోసం చాలా చేశారు. దాడులు జరిగినా మమ్మల్ని ఆదుకొనేవాళ్ళు. వాళ్ళు తిండి మానుకొని మాకు పెట్టారు. ప్రజలకు గుడ్డలు ఉండేవి కావు. ఆడవాళ్ళు సరైన బట్టలు లేక దళాలు వెళితే బిడ్డలను అడ్డంగా కప్పుకొనే వాళ్ళు. ఆహారం కోసం నిరంతరం వెతుకులాటలో ఉండేవాళ్లు. గిరిజన స్త్రీలు ముఖ్యంగా చాలా శ్రమ చేసేవాళ్ళు. అక్కడ దొరికే జీడి మావిడి టెంకలతో అంబలి కాయటం చాలా కష్టమైన పని. దుంపలు ఏరుకొని వచ్చి బిడ్డలకు పెట్టే వాళ్ళు. వంటలు వండుకోవటం కూడా సరిగ్గా వచ్చేది కాదు. మేము వాళ్ళకు వంటలు కూడా నేర్పించే వాళ్ళం. విప్లవ ఉద్యమం వాళ్ళలో చాలా మార్పు తీసుకొని వచ్చింది. పోలీసులను చూసి ఆమడ దూరం పారిపోయేవాళ్ళు, ఆయుధాలు పట్టుకొని మాతో నడిచారు. చదువుకొన్నారు.

ప్రశ్న : యాభై ఏళ్ళ మీ రాజకీయ జీవితం గురించి మీరు ఏమి అనుకొంటున్నారు? ఎక్కడైనా నిరాశ చెందారా?

చంద్రక్క: ఏజెన్సీలో ఎన్ని కష్టాలు పడినా, పోలీసుల చేతిలో చిత్రహింసల పాలు అయినా కానీ, జైలు జీవితంలో కానీ నాకు విప్లవం తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. పార్టీ గౌరవం కోసం ఎప్పుడూ నేను ఆలోచించాను. నాతో బాటు పని మొదలు పెట్టి అమరులైనవారిని తలుచుకొంటే దుఃఖం వస్తుంది. అలాంటి నాయకులు ఇప్పుడు లేరే అని బాధగా ఉంటుంది. అంబలిని పచ్చి మిరపకాయ, ఉల్లిపాయలతో తిన్నాము. గుడ్డలు లేక ఉండేటోళ్ళం. వరన్నం ఎరగం. గంటన్నం తిని పడుకొనేవాళ్లం. జీలుగుపిండి అంబలి తాగేవాళ్ళం. ఏ నిమిషంలో చచ్చిపోతామో తెలియదు. ఇంటికి చేరి చచ్చిపోవటం కాదు, నాకు ఎప్పటికైనా తూటాకే మరణించాలని అనిపిస్తుంది.

ప్రశ్న: పైలా వాసుదేవరావు గారితో మీ సహజీవనం గురించి …

చంద్రక్క: మా వైవాహిక జీవితంలో మేమిద్దరం కలిసి ఉన్నది తక్కువ. అయినా ఒకే మాట మీద, ఒకే రాజకీయాల మీద బ్రతికాము. ఎంతో మంది శ్రీకాకుళ విప్లవకారులు అమరులు అయిన కాలంలో మా పెళ్ళి జరిగింది. ఆ సందర్భం మా యిద్దరి వివాహానికి తరువాత మా విప్లవ జీవితానికి వేసిన గట్టి పునాది. నేను జైల్లో ఉన్నప్పుడు మాష్టారిని మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్పాను. నేను ఎప్పటికీ బయటికి వస్తానో, అసలు వస్తానో లేదో కూడా తెలియని పరిస్థితి అది. మాష్టారు కోప్పడ్డారు నన్ను. నమ్మిన రాజకీయాల కోసం ఆయన, నేను చివరిదాకా నిలబడ్డాము. అది అన్యోన్యం అంటారో ఇంకేమి అంటారో నాకు తెలియదు. ఆయనతో నా సహజీవనం భౌతికంగా కంటే మానసికంగా బలమైనది.

ప్రశ్న : దళాల ప్రాముఖ్యత ఇప్పుడు ఉందా?

చంద్రక్క: దళాలు వద్దనే వాళ్ళు విప్లవానికే పనికి రారు. ఈ రోజు గూండాలకు కూడా తుపాకులు ఉన్నాయి. దళాలు లేకపోతే ఈ ఉద్యమం నిర్మాణం చేయలేము. పోలీసులు ఏరేస్తారు. పేదప్రజలకు పీడన తొలగాలంటే, వాళ్ళ రాజ్యం రావాలంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా జరగదు. దళాలు వద్దంటే పార్లమెంటరీ పద్దతికి జిందాబాద్ కొట్టటమే.

ప్రశ్న: మీ మొత్తం విప్లవ జీవితంలో మీరు పని చేసిన పార్టీలో స్త్రీల పట్ల చిన్న చూపు ఉందా?

చంద్రక్క: ఆడవారిపైన చిన్న చూపు విప్లవ పార్టీలలో కూడా ఉంది. ఉద్యమంలో పని చేసి వచ్చి కూడా వంటగదిలోకి వెళ్ళి పని చేస్తున్నారు ఆడవాళ్ళు. అలాగే చదువురాని వారిపైన కూడా చిన్న చూపు ఉంది. సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతాలు ఏదో ఒక మేర విప్లవ పార్టీలలోకి కూడా చొరబడుతున్నాయి.

( పడిన కష్టాల గురించి చెప్పేటపుడు గొంతు వణికింది. అవమానాల గురించి మాట్లాడేటపుడు ఆమె గొంతు ఉద్రిక్తం అయ్యింది. అమరుల గురించి తలుచుకొన్నప్పుడు ఉద్విగ్నతకు గురి అయ్యింది. చంద్రక్క జీవితంలో ఇంకా ఎన్నో కోణాలు చూడాలంటే ఎన్నో కిటికీలు తెరిచి చూడాలి. నిజానికి ఒక గొప్ప గ్రంధం రాయదగిన జీవితం ఆమెది. కొన్ని ముఖ్యమైన ముక్కలు మాత్రమే ఈ రచనలో ఉన్నాయి.)
( మోదుగు పూలు....వెబ్ సైట్  నుంచి ..)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి